Razole: గంజాయి విక్రయించినా, తాగినా జైలుకే: రాజోలు సీఐ హెచ్చరిక

Razole: కోనసీమ జిల్లా తాటిపాకలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి బ్యాచ్‌పై ఉక్కుపాదం మోపుతామని సీఐ హెచ్చరించారు.

PRABHU, RAZOLE
Published on: 3 Oct 2026 3:05 PM IST
Razole
X

Razole: గంజాయి విక్రయించినా, తాగినా జైలుకే: రాజోలు సీఐ హెచ్చరిక

రాజోలు: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న వారిపై రాజోలు పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. గంజాయి విక్రయించినా.. సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని రాజోలు సీఐ సురేష్‌బాబు హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా తాటిపాకలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు.

రాజోలు పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడియాతో సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ.. రాజోలు ఎస్సై మల్లికార్జునరెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తాటిపాక గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి స్థానికంగా చిరు వ్యాపారం చేస్తున్న మైధుల్‌ లష్కర్‌తో పాటు కనపాల పవన్‌తేజ, బళ్ల ఉదయ్‌, దిగుమర్తి తేజకళ్యాణ్‌ గంజాయి విక్రయిస్తుండగా పట్టుబడ్డారని సీఐ వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల గంజాయితో పాటు గంజాయి సేవించేందుకు ఉపయోగించే సిగరెట్‌ బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్‌ పర్యవేక్షణలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఈగల్ టీం ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎక్కడ గంజాయి విక్రయాలు జరిగినా సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని సీఐ సురేష్‌బాబు పేర్కొన్నారు. గంజాయి విక్రయించినా, సేవించినా ఉపేక్షించేది లేదని, పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న వారి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE