Razole: రాజోలులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన
Razole: రాజోలులో పుష్కర్ ఘాట్ బీటీ రోడ్డు, బి.సావరంలో రూ.34.32 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Razole: రాజోలులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన
రాజోలు: రాజోలు మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ శంకుస్థాపనలు చేశారు. రాజోలు, బి.సావరం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ముందుగా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమలాపురం ఎంపీ శ్రీ గంటి హరీష్ బాలయోగితో కలిసి “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం రాజోలు పాత బస్టాండ్ ప్రాంతం నుంచి పుష్కర్ ఘాట్ వరకు రూ.27 లక్షల పుష్కరాల నిధులతో 500 మీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రహదారి పూర్తయితే పుష్కర్ ఘాట్‌కు వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
బి.సావరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.34.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్) వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




