Razole: అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కనుగొన్న పోలీసులు
Razole: రాజోలులో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులను పోలీసులు కేవలం రెండు గంటల్లోనే ట్రేస్ చేసి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Razole: అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కనుగొన్న పోలీసులు
రాజోలు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులకు రాజోలు పోలీసులు ఊరటనిచ్చారు. ఫిర్యాదు అందిన కేవలం రెండు గంటల్లోనే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి చిన్నారుల ఆచూకీని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో మంగళవారం ఉదయం ముగ్గురు చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై మధ్యాహ్నం రాజోలు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెంటనే స్పందించి చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో రాజోలు పోలీసులు క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. పోలీసుల వేగవంతమైన చర్యల ఫలితంగా ఫిర్యాదు అందిన సుమారు రెండు గంటల్లోనే చిన్నారుల జాడను గుర్తించారు.
ఈ సందర్భంగా రాజోలు సీఐ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడైన బాలుడు సరదాగా మిగిలిన ఇద్దరు చిన్నారులను వెంట తీసుకెళ్లినట్లు తెలిపారు. తాటిపాక నుంచి ములికిపల్లి వరకు బైక్పై లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ములికిపల్లిలో అయోమయ పరిస్థితిలో ఓ బల్ల వద్ద కూర్చుని ఉన్న చిన్నారుల గురించి పోలీసులకు సమాచారం అందిందన్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు చిన్నారులను సురక్షితంగా రాజోలు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆప్యాయంగా బుజ్జగించి, కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
పిల్లల ఆచూకీ కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు చిన్నారులు క్షేమంగా కనిపించడంతో ఒక్కసారిగా ఊరట లభించింది. కొన్ని గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించిన రాజోలు పోలీసుల తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.




