Razole: ఆసుపత్రి, అంగన్‌‌వాడీ కేంద్రం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుపై ఫిర్యాదు

Razole: రాజోలులో ఆసుపత్రి, అంగన్‌వాడీ కేంద్రం, ఇళ్లకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కోరుతూ తహసీల్దార్ మల్లేశ్వరరావుకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 5:56 PM IST
Razole
X

Razole: ఆసుపత్రి, అంగన్‌‌వాడీ కేంద్రం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటుపై ఫిర్యాదు

రాజోలు: ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి, అంగన్‌వాడీ కేంద్రం, నివాస గృహాలకు అత్యంత సమీపంలో మద్యం దుకాణం, పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని స్థానికులు కొందరు అధికారులను కోరారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాజోలు తహసీల్దార్ మల్లేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు.

రాజోలు పట్టణంలోని నాగార్జున వీధిలో సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా, అంగన్‌వాడీ కేంద్రానికి కేవలం 10 మీటర్ల దూరంలో, ఆసుపత్రికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటైతే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అదే ప్రాంతంలో గత 30 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు నిత్యం బస్సుల కోసం రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, నిబంధనలను పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కోరారు.

ప్రజల ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మద్యం దుకాణం ఏర్పాటును నిలిపివేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాస్, కాండ్రేగుల రాము, మొల్లేటి వీర వెంకట సత్యనారాయణ, కడలి వెంకట రమణ, చెల్లింగి శ్రీనివాస్, కడలి శివన్నారాయణ, చెల్లుబోయిన రెడ్డి, బీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE