Razole: అర్నబ్ తుఫాన్ ముప్పు అంతర్వేది తీరంలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం!

Razole: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంతర్వేది తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం. 70 మీటర్ల మేర చొచ్చుకొచ్చిన అలలు. సందర్శకులపై నిషేధం, అధికారుల అప్రమత్తత.

PRABHU, RAZOLE
Published on: 27 Oct 2026 4:25 PM IST
Razole
X

Razole: అర్నబ్ తుఫాన్ ముప్పు అంతర్వేది తీరంలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం!

రాజోలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు సుమారు 50 నుంచి 70 మీటర్ల మేర ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతంలో ఆందోళన నెలకొంది. సముద్రం ఉధృతంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. దీంతో వందలాది మత్స్యకార బోట్లు తీరానికే పరిమితమయ్యాయి.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్వేది తీర ప్రాంతానికి భక్తులు, సందర్శకుల రాకపోకలపై నిషేధం విధించారు. మెరైన్ సీఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు తీర ప్రాంతంలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. రాజోలు సీఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం తీర ప్రాంత గ్రామాల ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

తీర ప్రాంతంలో తాటాకు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాన్ షెల్టర్లను అందుబాటులో ఉంచి, పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

సముద్రం ఉధృతి దృష్ట్యా ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE