Razole: రాజోలు డిగ్రీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి!
Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి. ఆధునిక సాహిత్యానికి గురజాడ వెలుగు కాగడా: కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు ప్రశంస.
Razole: రాజోలు డిగ్రీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి!
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు మాట్లాడుతూ... ఆధునిక సాహిత్యానికి గురజాడ అప్పారావు వెలుగు కాగడా వంటివారని పేర్కొన్నారు. గురజాడ రచనలు సమాజంలో సామాజిక చైతన్యాన్ని, సంస్కరణ భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సాధికారతకు గురజాడ సాహిత్యం ప్రతీకగా నిలిచిందన్నారు. అప్పటి సమాజ పరిస్థితుల్లోనే స్త్రీలు స్వతంత్రంగా జీవించాలని, వారికి సమాన హక్కులు కల్పించాలని తన రచనల ద్వారా చాటిచెప్పారని వివరించారు.
అంటరానితనం, దేశభక్తి, స్త్రీ శక్తి వంటి సామాజిక అంశాలను గురజాడ తన రచనల్లో ప్రతిబింబించారని తెలిపారు. నేటి విద్యార్థులు గురజాడను ఆదర్శంగా తీసుకుని ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. గురజాడ రచనలు చదవడం ద్వారా సమాజం పట్ల బాధ్యత, మానవతా విలువలు, సామాజిక స్పృహ పెంపొందుతాయని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి సాహిత్యాన్ని కేవలం చదవడానికే పరిమితం కాకుండా, అందులోని సామాజిక సందేశాలను అర్థం చేసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నల్లి రాజు, తెలుగు విభాగాధిపతి డా. పి. లావణ్య, చరిత్ర అధ్యాపకులు శ్రీ కె. నాగరాజు, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




