Razole: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Razole: రాజోలులో కేడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 9 Oct 2026 5:00 PM IST
Razole
X

Razole: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి

రాజోలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో శివకోటి గ్రామంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద గురువారం 50వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పెచ్చెట్టి నరసింహరావు (బాబు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసుకుని నూటికి నూరు శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గొడ్డలి పార్టీకి అవకాశం లేకుండా కూటమి శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తల కష్టాన్ని, సేవలను తప్పకుండా గుర్తిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

గుత్తుల సాయి, గంధం పల్లంరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాలని సూచించారు. పింఛన్లు, స్త్రీశక్తి, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, నేతన్న నేస్తం వంటి పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. *పెచ్చెట్టి బాబు మాట్లాడుతూ*, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఐదేళ్లపాటు ప్రజలకు సేవలందించి ఇటీవల పదవీకాలం ముగిసిన నియోజకవర్గ టీడీపీ ఎంపీటీసీ సభ్యులను నాయకులు దుశ్శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన సుంకర గంగరాజు, విజయ దంపతుల శిశువుకు అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.4,00,769 విలువైన ఎల్‌ఓసీని లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం గొల్లపల్లి అమూల్య, గుత్తుల సాయి, గంధం పల్లంరాజు తదితర నాయకులు వివిధ గ్రామాల ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బందెల పద్మ, రాజోలు ఎంపీపీ కడలి శ్రీదుర్గ, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE