Razole: పైన కాదు.. మొదట్లోనే 7 గెలలు: రాజోలులో అరుదైన వింత
Razole: రాజోలు మండలం మెరకపాలెంలో రైతు పొలంలోని అరటి చెట్టు మొదట్లోనే ఏకంగా ఏడు గెలలు వేయడం స్థానికులను, అన్నదాతలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Razole: పైన కాదు.. మొదట్లోనే 7 గెలలు: రాజోలులో అరుదైన వింత
రాజోలు: అరటి చెట్టుకు సాధారణంగా చెట్టు పైభాగంలో ఒక గెల మాత్రమే వేయడం సహజం. కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం మెరకపాలెం గ్రామంలో ఇందుకు పూర్తి భిన్నమైన వింత కనిపించింది. రైతు ఎలుమర్తి బాబూరావు పొలంలోని ఒకే అరటి చెట్టు మొదలులోనే ఏకంగా ఏడు గెలలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా చెట్టు పైభాగంలో గెల కనిపిస్తే.. ఇక్కడ మాత్రం చెట్టు మొదలును ఆనుకుని వరుసగా ఏడు గెలలు రావడం విశేషం. అరటి చెట్టు నిర్మాణానికే భిన్నంగా కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు విస్తుపోతున్నారు.
‘‘అరటి చెట్టుకు గెల అంటే పైనే ఉంటుంది.. కానీ ఇలా మొదలులోనే ఏడు గెలలు రావడం ఎప్పుడూ చూడలేదు’’ అంటూ పలువురు రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన దృశ్యం గురించి తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు బాబూరావు పొలానికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
ఒకే అరటి మొదలులో ఏడు గెలలు ఏర్పడటానికి గల కారణాలపై వ్యవసాయ నిపుణులు పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదలులో ఏడు గెలలు వేసిన ఈ అరటి చెట్టు మెరకపాలెంలో చర్చనీయాంశంగా మారింది.




