Rampachodavaram: రంపచోడవరంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం.. జేఎఫ్సీ మేజిస్ట్రేట్
Rampachodavaram: రంపచోడవరంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవ ర్యాలీ, సదస్సు. ఉచిత న్యాయ సేవలను అర్హులంతా వినియోగించుకోవాలని జేఎఫ్సీ మేజిస్ట్రేట్ మురళి గంగాధర రావు పిలుపు.
Rampachodavaram: రంపచోడవరంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం.. జేఎఫ్సీ మేజిస్ట్రేట్
రంపచోడవరం: జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రంపచోడవరం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత రంపచోడవరం గ్రామంలో న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. మురళి గంగాధర రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థలు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు అందిస్తున్నాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడినవారు, అర్హులైన పేదలు, గిరిజనులు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు తదితరులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. న్యాయస్థానాల్లో కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు, ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) అమలు చేస్తున్న పథకాలైన మానవ అక్రమ రవాణా, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ బాధితుల సహాయ పథకం, పేదరిక నిర్మూలన పథకాల సమర్థ అమలు, గిరిజనుల హక్కుల పరిరక్షణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం బాధితుల పునరావాసం, సీనియర్ సిటిజన్ల సంక్షేమ పథకాలు, శిక్షా పథకాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థినులు, బాలికలకు వారి హక్కులు, బాధ్యతలపై ప్రత్యేకంగా వివరించారు. రాజ్యాంగ ఆవిర్భావం, రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, ఉచిత న్యాయ సహాయం ప్రాముఖ్యత, ఎన్డీపీఎస్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించి, అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పిల్లల ప్రవర్తన, నడవడిక, భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేజిస్ట్రేట్ సూచించారు. పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ, చట్టాల పట్ల గౌరవం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను కాపాడుకుంటూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు వై. శ్రీనివాస రావు, ఏ.ఆర్.ఆర్. భగవాన్, టి. వీరబాబు, గౌరీశంకర్, పాఠశాల యాజమాన్యం, పోలీసు సిబ్బంది, కోర్టు సూపరింటెండెంట్ నాగభూషణం, కోర్టు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




