Rajavommangi: స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీషాదేవి

Rajavommangi: రాజవొమ్మంగిలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

Prasanna, Rampachodavaram
Published on: 2 Oct 2026 8:38 PM IST
Rajavommangi
X

Rajavommangi: స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీషాదేవి

రాజవొమ్మంగి: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పోలవరం జిల్లా, రాజవొమ్మంగి సచివాలయం వద్ద ఎంపీడీవో లోకుల యాదగిరేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

గ్రామాల్లోని పొడి చెత్తను సేకరించి, వాటి బరువును బట్టి ప్రజలకు అవసరమైన వస్తువులను అందించే విధంగా స్వచ్ఛ రథం పనిచేస్తుందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఈ వాహనం తిరుగుతుందని తెలిపారు. ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు బాటిళ్లు, స్టీల్, అల్యూమినియం వస్తువులను సేకరిస్తారన్నారు. నిర్ణీత ధరల ప్రకారం సబ్బులు, షాంపూలు, పంచదార తదితర 17 రకాల వస్తువులను అందజేస్తారని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ పంపిణీ

రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి యూనిఫామ్ ను పంపిణీ చేశారు. ప్రాజెక్ట్ పరిధిలో 103 కేంద్రాల్లో పని చేస్తున్న వర్కర్స్, హెల్పర్స్ ఒక్కక్కరికి రెండు యూనిఫామ్ ను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “అంగన్వాడీ అంటే నా కుటుంబం” అని అన్నారు. అంగన్వాడీ వర్కర్‌గా పనిచేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు, వర్కర్లు, హెల్పర్లకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా వట్టిగడ్డ క్యాంపు కార్యాలయానికి వచ్చి తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లోకుల యాదగిరేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, ముప్పన సావిత్రి, సీడీపీఓ అనంతలక్ష్మి, ఈఓపీఆర్డీ విజయ్ కుమార్, గ్రామ వార్డు సచివాలయ అధికారి పైడిరాజు, పంచాయతీ అభివృద్ధి అధికారి పి. చరణ్, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram