Rajahmundry: రాజమండ్రిలో ఎన్నికల నియమావళి పాటించాలి

Rajahmundry: రాజమండ్రి నగరపాలక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి, ఓటర్ స్లిప్పులు, ఫ్లెక్సీల అనుమతులపై అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ సూచనలు చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 20 Nov 2026 6:05 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ఎన్నికల నియమావళి పాటించాలి

రాజమండ్రి: నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయు రాజకీయ పార్టీలు ప్రచార సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ సూచించారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్పుల ముద్రణ, పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈ సందర్భంగా వివరించారు. ఓటర్లకు సంబంధిత పోలింగ్ కేంద్రం నంబరు, ఓటరు జాబితాలోని క్రమ సంఖ్య తెలుసుకునేందుకు ఫొటో ఓటర్ స్లిప్పులు ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ స్లిప్పులను ఎన్నికల సిబ్బంది(బీఎల్ఓ) ద్వారా నిబంధనల ప్రకారం ఇంటింటికీ పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఫొటో ఓటర్ స్లిప్పు కలిగి ఉండటం ఓటు వేయడానికి తప్పనిసరి కాదని, స్లిప్పు లేని కారణంగా ఏ ఒక్కరినీ ఓటు వేయడానికి అనర్హుడిగా పరిగణించడం జరగదన్నారు. ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని వివరించారు.

ఎన్నికల వెబ్ సైట్ లో ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు

నగరపాలక ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లింక్ లో పరిశీలించుకోవచ్చని అదనపు కమిషనర్ తెలిపారు. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత EPIC నంబర్/ ఫోన్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ వినియోగించుకుని, ముందుగానే తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ముద్రించిన ప్రచార సామాగ్రి సంఖ్య, సంబంధిత వివరాలను నగరపాలక కార్యాలయంలోని ఎన్నికల వ్యయ పర్యవేక్షణ విభాగంలో అందజేయాలని అదనపు కమిషనర్ అన్నారు. ప్రచారము చేయుటకు వాడు వాహనముల అనుమతులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పోటీ చేయు అభ్యర్థులు బ్యానర్లు మరియు ఫ్లెక్సీలను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ / మున్సిపల్ ఖాళీ స్థలములు మరియు ఏ విధమైన ప్రభుత్వ ఆస్తుల మీద ప్రదర్శించరాదని పేర్కొన్నారు.

బ్యానర్లు మరియు ఫ్లెక్సీలను ప్రైవేటు బిల్డింగులు మరియు ఖాళీ స్థలములనందు సదరు యజమాని అనుమతితో ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. అట్టి అనుమతి పత్రము నగరపాలక ప్రధాన కార్యాలయం సమర్పించాలన్నారు. అనుమతి లేని ఫ్లెక్సీలు / బ్యానర్లు ప్రదర్శించు అభ్యర్థులపై ఎన్నికల నిబంధనావళిని అనుసరించి చర్యలు తీసుకొనబడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY