Rajahmundry: అంతర్జాతీయ పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్ల క్రీడాకారిణులు
Rajahmundry: వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ పతకాలు సాధించిన రాజమండ్రి క్రీడాకారిణులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిశారు. అభినందించిన ఎమ్మెల్యే.
Rajahmundry: అంతర్జాతీయ పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్ల క్రీడాకారిణులు
రాజమండ్రి: వెయిట్‌లిఫ్టింగ్‌లో కఠోర సాధనతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు యువ క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారు. చిన్న వయసు నుంచే శిక్షణ పొందుతూ ఎన్నో విజయాలు సాధించిన వీరు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
వివిధ స్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారిణులు, వారి కోచ్ యాళ్ల భాస్కర్‌రావు ఈరోజు రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ విజయాలను ఎమ్మెల్యేకు వివరించారు. హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ కూడా పాల్గొన్నారు. కాగా కరంగి తరంగిణి నాలుగో తరగతి నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.
ఇప్పటివరకు మూడు సార్లు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌గా, మూడు సార్లు స్కూల్ గేమ్స్ నేషనల్ ఛాంపియన్‌గా, మూడు సార్లు ఓపెన్ నేషనల్స్ ఛాంపియన్‌గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో రజత పతకం సాధించడంతో పాటు, ఆసియా స్థాయి పోటీల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, వరల్డ్ యూనివర్సిటీ పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని తరంగిణి తెలిపారు.
చల్లబత్తుల జుహితగుణ ఆరో తరగతి నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధన చేస్తున్నారు. మూడు సార్లు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌గా, మూడు సార్లు ఓపెన్ నేషనల్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచారు. 2025 కామన్వెల్త్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించారు. భవిష్యత్తులో యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాలన్నదే తన ఆశయమని జుహిత గుణ తెలిపారు. కరంగి హేమశ్రీ మూడో తరగతి నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.
మూడు సార్లు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌గా, మూడు సార్లు ఓపెన్ నేషనల్స్‌లో స్వర్ణ పతక విజేతగా, మూడు సార్లు స్కూల్ గేమ్స్ నేషనల్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచారు. ఒకసారి ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డును కూడా అందుకున్నారు. భవిష్యత్తులో ఆసియా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని హేమశ్రీ తెలిపారు. ఈ ముగ్గురు క్రీడాకారిణులకు యాళ్ల భాస్కర్‌రావు శిక్షణ అందిస్తున్నారు.
తమను ప్రోత్సహిస్తూ, అండగా నిలుస్తూ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంతో కృషి చేస్తున్నారని క్రీడాకారిణులు తెలిపారు. తమకు అందిస్తున్న ప్రోత్సాహం, సహాయ సహకారాలకు ఎమ్మెల్యేకు, కోచ్ యాళ్ల భాస్కర్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడాకారిణులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాజమహేంద్రవరం నగరానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




