Rajahmundry: 35వ డివిజన్‌లో 30 ఏళ్ల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
Rajahmundry: రాజమండ్రి 35వ డివిజన్‌లో దశాబ్దాల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.84 లక్షలతో ఆర్సీసీ అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Rajahmundry: 35వ డివిజన్‌లో 30 ఏళ్ల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
రాజమండ్రి: స్థానిక 35వ డివిజన్ తుమ్మలోవ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ, ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడింది. రూ.84 లక్షల వ్యయంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి సాయిబాబా ఆలయం వరకు నిర్మించనున్న ప్రధాన ఆర్సీసీ అవుట్‌ఫాల్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిదని, 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ ప్రజలు పార్టీకి విశేష ఆదరణ చూపించారని తెలిపారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఈ డివిజన్‌లో రూ.90 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. తుమ్మలోవ మెయిన్ రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి సాయిబాబా ఆలయం వరకు గత మూడు దశాబ్దాలుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షపు నీరు, మురుగునీరు సక్రమంగా వెళ్లక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రోడ్లు అభివృద్ధి చేసినంత మాత్రాన సరిపోదని, నీరు నిల్వ ఉండకుండా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రూ.84 లక్షలతో ప్రధాన డ్రైన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు తుమ్మలోవ ప్రాంతంలోని రెండు వీధులు ముంపునకు గురయ్యేవని, గత ఐదేళ్లలో చేపట్టిన కొన్ని నిర్మాణాల కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమై నాలుగున్నర వీధుల వరకు విస్తరించిందని స్థానికులు చెబుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకులతో చర్చించి, దేవీచౌక్ నుంచి రెయిన్‌బో కలర్ ల్యాబ్ మీదుగా వెటర్నరీ ఆసుపత్రి వరకు మేజర్ డ్రైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో ముంపు ప్రభావం కొంతవరకు తగ్గిందన్నారు. కంబాల చెరువు జంక్షన్, రామచంద్రరావుపేటలోని 36వ డివిజన్ అశోక్ కళ్యాణ మండపం పరిసరాల్లోనూ ముంపు సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇటీవల రూ.25 కోట్లతో మరో ప్రధాన డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రస్తుతం 35వ డివిజన్‌లో నిర్మిస్తున్న డ్రైన్‌ను ఈ ప్రధాన డ్రైన్‌కు అనుసంధానం చేయడం ద్వారా నీటి నిల్వ సమస్యను మరింత తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, నగరంలో రూ.300 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా తుమ్మలవ ప్రాంతంలోని రెండు, మూడు, నాలుగు, ఆరు వీధుల్లో రూ.3.72 కోట్లతో కొత్త రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, కొత్త డ్రైన్లు నిర్మించడం ద్వారా ముంపు సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు స్థానిక ప్రజలకు నిత్యావసరాలు, తాగునీరు అందించేందుకు తాము స్వయంగా కృషి చేసిన సందర్భాలను గుర్తుచేశారు. ఇటీవల వర్షాల సమయంలోనూ డ్రైనేజీల శుభ్రత, నిర్వహణ చర్యల వల్ల పరిస్థితుల్లో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే దీర్ఘకాలిక అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని, ప్రచారానికి కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యమిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రస్తుతం నగరంలో రోడ్లు, వాటర్ పైప్‌లైన్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నందున ప్రజలు కొంత అసౌకర్యాన్ని సహించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




