Rajahmundry: ఆడబిడ్డల జోలికొస్తే ఉపేక్షించం ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరిక!
Rajahmundry: ఆడబిడ్డల జోలికొస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు: రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. చిన్నారి గోపిక కేసు నిందితుడిని మార్గాని భరత్ వెనకేసుకురావడంపై ఆగ్రహం.
Rajahmundry: ఆడబిడ్డల జోలికొస్తే ఉపేక్షించం ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరిక!
Rajahmundry: రాజమండ్రి రాప్తాడులో చిన్నారి గోపికపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని, ఇలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిందితుడి పట్ల మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
నిందితుడిని అమాయకుడు, పేదవాడు, చిన్నవాడు అంటూ వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. చిన్నారి గోపికకు వైద్యపరంగా అవసరమైన సహాయాన్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, మరోవైపు ఘటనకు కారకులైన వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంలో ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు వెళ్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
ఒక సున్నితమైన ఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజానికి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అలాంటిది నిందితుడిని అమాయకుడిగా చిత్రీకరిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిందితుడికి శాలువా కప్పి సన్మానం చేయాలా..? అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
మార్గాని భరత్‌కు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని గుర్తుచేస్తూ, ఇలాంటి ఘటన మీ కుటుంబానికి ఎదురైతే నిందితుడిని పేదవాడు, అమాయకుడు అంటూ వదిలేస్తారా..? లేక బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటారా..? అని ప్రశ్నించారు. ఒక ఘటన తన వరకు వస్తే ఒకలా, రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే మరోలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు ఇలాంటి ఘటనలు జరగకూడదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతుంటే, అదే పార్టీకి చెందిన నాయకులు మరోవైపు నిందితుడిని వెనకేసుకొస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
తమ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉండాలని, ఆడపిల్లలపై జరిగే దాడుల వంటి సున్నితమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని ఎమ్మెల్యే వాసు సూచించారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ జోలికైనా ఎవరైనా వస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు.




