Rajahmundry: పద్మావతి నగర్‌లో రూ.80 లక్షలతో డ్రైనేజీ పనుల శంకుస్థాపన

Rajahmundry: రాజమండ్రిలో రూ.80 లక్షలతో ఆర్‌సీసీ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తాగునీటి సమస్యకూ శాశ్వత పరిష్కారమని వెల్లడి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 18 Sept 2026 6:12 PM IST
Rajahmundry
X

Rajahmundry: పద్మావతి నగర్‌లో రూ.80 లక్షలతో డ్రైనేజీ పనుల శంకుస్థాపన

రాజమండ్రి: స్థానిక 10వ డివిజన్ పద్మావతి నగర్‌లో సుమారు 30 ఏళ్లుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పద్మావతి నగర్‌లో రూ.80 లక్షలతో చేపట్టనున్న ఆర్‌సీసీ డ్రైన్, అంతర్గత సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పద్మావతి నగర్‌తో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన సమయంలో ఈ ప్రాంతంలోనే తొలినాళ్లలో సమావేశం నిర్వహించారని, అందుకే ఈ ప్రాంతంతో పార్టీకి భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. ఇక్కడే మినీ మహానాడు కూడా నిర్వహించామని గుర్తుచేశారు.

గత 25–30 ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిధులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యవసరమైన, ప్రజలకు నేరుగా ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10వ డివిజన్‌లో ఇప్పటికే సుమారు రూ.5.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి పూర్తి చేశామని ఎమ్మెల్యే వాసు చెప్పారు.

తాజాగా రూ.80 లక్షలతో 1,080 మీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా పద్మావతి నగర్‌లో రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.4 కోట్ల అంచనాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పుష్కర పనుల్లో భాగంగా నగరంలో చేపట్టనున్న సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి పనుల్లో పద్మావతి నగర్‌తో పాటు 10వ డివిజన్‌లోని గాదాలమ్మ నగర్, అలకాపురి లే అవుట్ అభివృద్ధి పనులు కూడా ఉన్నాయని తెలిపారు.

టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పద్మావతి నగర్‌లో తాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం బత్తినగర్‌ నుంచి నీటి సరఫరా జరుగుతున్నందున తగినంత నీటి ఒత్తిడి రావడం లేదన్నారు. హైవే అవతల ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నుంచి పద్మావతి నగర్‌కు పైప్‌లైన్‌ ద్వారా నీటిని తీసుకురావాలని నిర్ణయించామని, ఇందుకోసం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.

జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు నిర్వహించి, సుమారు నెల రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు అందకపోయినా, అందుబాటులో ఉన్న నిధులతో ప్రజలకు అత్యంత అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

అభివృద్ధి పనుల్లో రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అన్నదే తమకు ప్రధాన కొలమానమని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా ఇదే విధానంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY