Rajahmundry: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

Rajahmundry: రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అకడమిక్ ఫెస్ట్-2026లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు; సింథటిక్ ట్రాక్, ఇండోర్ కోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 5 Oct 2026 6:56 PM IST
Rajahmundry
X

Rajahmundry: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమండ్రి: ఆర్ట్స్ కళాశాల ప్రతిష్టను, ఘన చరిత్రను కాపాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వార్షిక అకడమిక్ ఫెస్ట్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఆర్ట్స్ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని, వేలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాల ముఖద్వారాన్ని ఆధునికీకరించడం జరిగిందని, ఈ అభివృద్ధికి ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. ఆర్ట్స్ కళాశాలలో మంత్రి నారా లోకేష్ పర్యటన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఈ సంస్థకు మరింత గుర్తింపును తీసుకొచ్చిందన్నారు.

కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మెగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి టీసీఎస్, ఐబీఎం వంటి సంస్థలు రావడంతో పాటు ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు.

విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. తెలిసీ తెలియక చేసిన ఒక్క తప్పు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఒక్క కేసు వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ కళాశాల ప్రతిష్టను పెంచేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

కళాశాలకు కన్వెన్షన్ సెంటర్, ఇండోర్ షటిల్ కోర్టు

ఆర్ట్స్ కళాశాలకు సమీపంలో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ కోరిన మేరకు ఇండోర్ షటిల్ కోర్టును శాప్ ద్వారా మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. కళాశాలలోని ప్రస్తుత రెడ్ సాయిల్ వాక్ అండ్ రన్నింగ్ ట్రాక్‌ను సింథటిక్ ట్రాక్‌గా మార్చడంతో పాటు మధ్యలో ఫుట్‌బాల్ మైదానం, చుట్టూ గ్యాలరీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నగరాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.

వీఎల్ పురం లారీ స్టాండ్ సమీపంలో సుమారు రూ.52 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయని, కేలో ఇండియా, శాప్ సహకారంతో వివిధ క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. లాలాచెరువులో స్పోర్ట్స్ పార్క్, సింథటిక్ బాస్కెట్‌బాల్, కబడ్డీ కోర్టులు, ఎస్కేవీటీ కళాశాలలో బాస్కెట్‌బాల్ కోర్టు వంటి పనులు చేపట్టినట్లు వివరించారు.

యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వచ్చే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రాజమహేంద్రవరంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహించే బాధ్యతను తీసుకుంటానని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రముఖ కంపెనీలను వ్యక్తిగతంగా ఆహ్వానించి విద్యార్థులకు మెరుగైన ప్లేస్‌మెంట్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడమే అకాడమిక్ ఫెస్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు. కళాశాలలోని వివిధ విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని చెప్పారు.

విద్యార్థులు నిర్వహిస్తున్న ‘అరకు కాఫీ షాప’ ద్వారా ఆదాయాన్ని సమకూర్చి, దాని లాభాలను మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లుగా అందించడం ద్వారా విద్యతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రిన్సిపాల్ వివరించారు. కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలు, జ్ఞాపికలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY