Rajahmundry: కార్పొరేషన్ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఆదిరెడ్డి!
Rajahmundry: రాజమండ్రి నగరపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రామిక భవనానికి నిధులు ప్రకటించారు.
Rajahmundry: కార్పొరేషన్ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఆదిరెడ్డి!
రాజమండ్రి: నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేషన్ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్మిక సోదరులకు పిలుపునిచ్చారు. కూటమి మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కార్మికులపై ఉందన్నారు. ఆర్యాపురంలోని టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో టీఎన్టీయూసీ నాయకులు నక్కా చిట్టిబాబు, వర్రే శ్రీనివాసరావు, నల్లం శ్రీను సారథ్యంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబ రాజకీయ ప్రస్థానంలో, ప్రతి విజయ వెనుక కార్మిక సోదరుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. 2019లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా టీడీపీ విజయానికి కార్మికులు చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ అందించడంలో కార్మికుల కృషి ఉందని కొనియాడారు.
కార్మికుల సమస్యలను తమ కుటుంబ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపించామన్నారు. శ్రామిక భవన నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.70 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. భవన నిర్మాణం పూర్తి కావడానికి మరో రూ.50 లక్షలు అవసరమని, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆ నిధులు సమకూర్చి భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తాము కూడా కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన వారమేనని, పదవులు పూలబాటలో రాలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పోరాడి, పార్టీ జెండాను మోసి ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం గాడి తప్పించిన వ్యవస్థలను సరిదిద్దుతూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో సంపద పెంచడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపకుండా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయం కొనసాగాలని, ఏ పార్టీకి ఏ డివిజన్ కేటాయించినా అక్కడి కూటమి అభ్యర్థి విజయానికి మిగిలిన పార్టీల నాయకులు, కార్యకర్తలు సంపూర్ణంగా సహకరించాలని సూచించారు.
కూటమి ఐక్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. టీఎన్టీయూసీ కార్మిక సంఘం బలమైన వ్యవస్థ అని, ఇక్కడ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ మరో పది నుంచి యాభై మందిని ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా కూటమి విజయం అవసరమనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు.
కార్మికులను గౌరవించడం తన బాధ్యతగా భావిస్తానని పేర్కొంటూ, గతంలో టీఎన్టీయూసీ కార్యక్రమంలో వేలాది మంది కార్మికులను స్వయంగా సన్మానించేందుకు మూడున్నర గంటల సమయం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కార్మికులను గౌరవించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. రానున్న పది రోజులపాటు కార్మికులు తమ పనులను కొనసాగిస్తూనే రోజుకు రెండు, మూడు గంటలు పార్టీ కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
డివిజన్ల వారీగా అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే వారి విజయానికి కృషి చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరంలో మొత్తం 42 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికులందరూ సమష్టిగా పనిచేసి కూటమి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.




