Rajahmundry: రూ.1.32 కోట్లతో జాంపేట వంతెన నుంచి నాగుల చెరువు వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ!

Rajahmundry: రాజమండ్రి 28, 29, 30 డివిజన్లను అనుసంధానించే బీటీ రోడ్డు పునరుద్ధరణకు రూ.1.32 కోట్లతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 11 Oct 2026 10:36 PM IST
Rajahmundry
X

Rajahmundry: రూ.1.32 కోట్లతో జాంపేట వంతెన నుంచి నాగుల చెరువు వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ!

రాజమండ్రి: స్థానిక 28, 29, 30 డివిజన్లను అనుసంధానించే ప్రధాన రహదారికి మహర్దశ పట్టింది. జాంపేట వంతెన నుంచి సాయికృష్ణ థియేటర్, డీలక్స్ సెంటర్ మీదుగా నాగుల చెరువు వరకు ఉన్న శిథిలావస్థకు చేరిన బీటీ రోడ్డును రూ.1.32 కోట్లతో పునరుద్ధరించే పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు డివిజన్ల ప్రజలకు కీలకమైన ఈ రహదారి చాలాకాలంగా దెబ్బతిని ఉండటంతో ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా జాంపేట వంతెన నుంచి డీలక్స్ సెంటర్ వరకు గత 15 ఏళ్లుగా నెలకొన్న సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు.

ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అమృత్ 2.0 పథకం కింద కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. జాంపేట వంతెన కుడివైపు ఉన్న సమస్యను పబ్లిక్ హెల్త్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో ఆ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

మూడు, నాలుగు డివిజన్లను అనుసంధానించే ప్రధాన రహదారులకు కేవలం మరమ్మతులు చేయడమే కాకుండా, అవసరమైన చోట పూర్తిగా కొత్త రహదారులను నిర్మించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, నాయకులు చాపల చిన్నరాజు, వైవీడి ప్రసాద్, రుంకాని విజయ్, బి శివారెడ్డి, కృష్టాఫర్, అధిక సంఖ్యలో స్థానిక కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY