Rajahmundry: హైటెక్ బస్టాండ్ ముంపునకు చెక్ రూ.8 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభం!
Rajahmundry: హైటెక్ బస్టాండ్ ముంపునకు చెక్: రూ.8 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభం!
Rajahmundry: హైటెక్ బస్టాండ్ ముంపునకు చెక్ రూ.8 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభం!
రాజమండ్రి: నగరంలో ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న హైటెక్ బస్టాండ్ ముంపు సమస్య పరిష్కారానికి రూ.8 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇందులో పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా రూ.6 కోట్లు, నగరపాలక సంస్థ ద్వారా రూ.2 కోట్లు వెచ్చించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హైటెక్ బస్టాండ్ వద్ద ముంపు సమస్య గత 30–40 ఏళ్లుగా నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గతంలో పరిష్కారం కాని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
నగరం విస్తరిస్తుండటంతో కంబాల చెరువు పరిసరాల నుంచి వచ్చే మురుగునీరు, వర్షపు నీరు ప్రస్తుత ప్రధాన డ్రైన్ సామర్థ్యానికి మించి ప్రవహిస్తోందని వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు కిమ్స్ ఆసుపత్రి మార్గం మీదుగా అదనపు డ్రైన్ నిర్మించి నల్లా ఛానల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అలాగే హైటెక్ బస్టాండ్ వద్ద లోతుగా ఉన్న రహదారిని ఎత్తు పెంచడంతోపాటు, నల్లా ఛానల్ వద్ద డబుల్ వెంట్ నిర్మాణం చేపట్టి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు.
మొత్తం రూ.8 కోట్లతో చేపడుతున్న పనులను మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగర అభివృద్ధిలో భాగంగా వీఎల్ పురంలోని పాత లారీ స్టాండ్ సమీపంలో రూ.28 కోట్లతో నిర్మించనున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1 పనులను బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ హైటెక్ బస్టాండ్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో స్వల్ప వర్షం కురిసినా నీరు నిలిచిపోతోందన్నారు.
ప్రస్తుతం ఉన్న డ్రైన్ సామర్థ్యం రోజువారీ మురుగునీటి ప్రవాహానికే సరిపోతోందని, వర్షపు నీరు అదనంగా చేరడంతో సమస్య తీవ్రతరం అవుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో అదనపు డ్రైన్ నిర్మాణం, రహదారి ఎత్తు పెంపు, నల్లా ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యం పెంపు పనులను సమాంతరంగా చేపడుతున్నట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, భవిష్యత్తులో ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
స్థానికులు సత్యనారాయణ మాట్లాడుతూ హైటెక్ బస్టాండ్, కంబాల చెరువు పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్య పరిష్కారం కోసం గతంలో పలువురు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు స్థానిక ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




