Rajahmundry: గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ పరామర్శ!

Rajahmundry: యార్నగూడెం వద్ద గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును మాజీ ఎంపీ భరత్ రామ్ పరామర్శించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Oct 2026 12:27 PM IST
Rajahmundry
X

Rajahmundry: గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ పరామర్శ!

Rajahmundry: గత నెల 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా యార్నగూడెం వద్ద జాతీయ రహదారిపై గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావును మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ మార్గాన్ని భరత్ రామ్ బుధవారం పరామర్శించారు.

ఏ ఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అతడు ప్రస్తుతం హైవే పెట్రోలింగ్ వాహనానికి డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే యార్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన విచారణ పూర్తి చేసుకొని వస్తుండగా అతనిపై ఈ దాడి ఘటన జరిగింది. బస్టాప్ అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు యువకులను ప్రశ్నించగా వారిలో ఇద్దరు వారి వద్ద ఉన్న ఆయుధంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును ఛాతీ, పొత్తికడుపు భాగంలో తీవ్రంగా గాయాలు చేసి పరారయ్యారు.

పోలీసులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆ తరువాత మెరుగైన వైద్యం నిమిత్తం బోల్లినేని కిమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొంది ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెంకటేశ్వరరావును మార్గాన్ని భరత్ రామ్ పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నారని తాను ప్రశ్నించేసరికి ఇద్దరు పరారు కాగా మరొక ఇద్దరు తనపై కత్తితో దాడి చేసినట్టు వివరించాడు.

తనకు చాలా బలమైన గాయాలు కావడంతో వైద్యులు సుమారు 7 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తనకు మంచి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపాడు.

అనంతరం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచులు విచ్చలవిడిగా సంచరిస్తూ దారుణాలకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆవేదన చెందారు. వారు కచ్చితంగా గంజాయి రవాణా బ్యాచ్ అని

పోలీసులకు దొరికిపోతామనే భయంతోనే వారు ఆయనపై దాడి చేసి పరారయ్యారని పేర్కొన్నారు. గంజాయి రవాణా ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో బాధితుడు వెంకటేశ్వరరావు కోలుకున్నాడు కాబట్టి సరిపోయిందని అదే ఇంకా పెద్దగా గాయాలై ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయంకరంగా ఉందని అన్నారు.

రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. వారిని అదుపు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. తాము చాలా కాలం నుంచి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై పోరాటాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు.

గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు సేవిస్తున్న వారిని, వారిని వెనక ఉండి ప్రోత్సహిస్తున్న వారిని కూడా అరెస్టు చేయాలని కోరారు. ఇప్పటికైనా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లపై చర్యలు తీసుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజలు రోడ్డుపైకి వచ్చేందుకు భయపడే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా విధుల నిర్వహణకు రావాలని ఆకాంక్షించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY