Rajahmundry: 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం ప్రారంభం కమిషనర్ రాహుల్ మీనా
Rajahmundry: రాజమండ్రిలో 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. నగరాలను అగ్రగామిగా నిలపాలని పిలుపు.
Rajahmundry: 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం ప్రారంభం కమిషనర్ రాహుల్ మీనా
రాజమండ్రి: స్వచ్ఛత హీ సేవా – 2026 కార్యక్రమం అమలులో రాజమహేంద్రవరం నగరాన్ని అగ్రగామిగా నిలుపుదామని కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. గురువారం నగరపాలక సంస్థ పీజీఆర్ఆర్ఎస్ హాల్ నందు స్వచ్ఛత హీ సేవా – 2026 కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఏడాది స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు నిర్వహించనున్న 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించాలన్నారు.
ఈ ఏడాది ప్రచార కార్యక్రమం ‘స్వచ్ఛతా మే సహభాగ్’, ‘స్వచ్ఛ భారత్’, ‘వికసిత్ భారత్’ అనే నినాదంతో నిర్వహించుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంత ముఖ్యమని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు.
పారిశుధ్య నిర్వహణకు ప్రజారోగ్య కార్మికులు ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కనుక సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లపై చెత్త వేయకుండా ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనానికి తడి,పొడి చెత్తలను వేరుచేసి అందించేలా అవగాహన కలిగించాలన్నారు. అపారిశుధ్యం కారణంగా వ్యాధుల వ్యాప్తి, అనారోగ్య పరిస్థితులపై ప్రజలను తెలియజేయాలన్నారు. అలాగే పౌరులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు పెద్దఎత్తున కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడమే మన అందరిపై ఉన్న గురుతరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మాధవి, మేనేజర్ అబ్దుల్ మలిక్, శానిటరీ సూపర్ వైజర్లు శ్రీనివాస్, రామలింగారెడ్డి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, సెక్రటరీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




