Rajahmundry: సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత మెప్మా పీడీ కనకరాజు
Rajahmundry: రాజమండ్రిలో ఈనెల 7 వరకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణపై మహిళలకు అవగాహన కల్పించిన మెప్మా పీడీ కనకరాజు.
Rajahmundry: సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత మెప్మా పీడీ కనకరాజు
రాజమండ్రి: పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరక్టర్ టి.కనకరాజు అన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలలో భాగంగా మెప్మా కార్యాలయం నందు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై బుధవారం అవగాహన కల్పించారు.
నవంబర్ 1 నుండి 7 వరకు సుస్థిర జీవన శైలిలో ఆచరణలో పెట్టాల్సిన ఏడు అంశాలను ఏడు రోజుల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్యుత్, నీటి పొదుపు, సుస్థిర ఆహార విధానాలు, వ్యర్థాల తగ్గింపు, సహజ వనరుల సంరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించడమే వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా నాల్గవ రోజు ఆహార వృథా నివారణ, చిరుధాన్యాలు మరియు సంప్రదాయ ఆహార వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇంధన వనరులను ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు.
వారోత్సవాల్లో భాగంగా మిగిలిన రోజుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఈ-వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాలపై నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. మహిళలందరూ ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సుస్థిర జీవనశైలి అలవాట్లను తమ దైనందిన జీవితంలో పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఎం రామలక్ష్మి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.




