Nagaram: గ్యాస్ లీకేజీ బాధితులను తక్షణమే ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్!

Nagaram: కోనసీమ జిల్లా నగరం పరిధి తాడివారిమెరక గ్యాస్ లీకేజీ బాధితులను సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మంగళవారం పరామర్శించి ధర్నా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 17 Nov 2026 7:52 PM IST
Nagaram
X

Nagaram: గ్యాస్ లీకేజీ బాధితులను తక్షణమే ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్!

నగరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరకలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనతో ప్రాణభయంతో ఇళ్లను వదిలి పారిపోయి సహాయ శిబిరంలో తలదాచుకున్న బాధితులను సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 2014లో నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ విస్ఫోటనంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఆ దుర్ఘటన తర్వాత కూడా ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే తరచూ గ్యాస్ పైపులైన్లలో లీకేజీలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

ఇటీవల మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ ప్రమాదాన్ని మరువకముందే మరోసారి ఈ ఘటన జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో గ్యాస్ నిల్వలు లేవని మూసివేసిన బావులను ఓఎన్జీసీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి డీప్ ఎనర్జీ సంస్థకు రీడ్రిల్లింగ్ కోసం అనుమతులు ఇవ్వడం, ఆ సంస్థ తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు.

2014లో జరిగిన గ్యాస్ విస్ఫోటనం అనంతరం నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని, వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

ప్రస్తుత ఘటనలో బాధితులు సహాయ శిబిరంలో ఆశ్రయం పొందుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కనీస సహాయ సహకారాలు అందించలేదని, గ్రామస్తులే భోజన వసతి కల్పించారని తెలిపారు.

బాధితులను ఆదుకోవాలని దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. స్పందించిన ఆర్డీఓ అక్కడికి చేరుకుని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయారని, బాధితులకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

ఇప్పటివరకు ఓఎన్జీసీ అధికారులు సహాయ శిబిరాన్ని సందర్శించకపోవడంపై బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దేవ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చమురు సహజ వనరుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యులు జాలెం సుబ్బారావు, బత్తుల మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ మట్ట సురేష్, చిలకపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE