Chintoor: సీలేరు నది సాక్షిగా కోట్లలో గోవుల అక్రమ రవాణా దందా!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో సీలేరు నది సాక్షిగా కోట్లలో గోవుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒడిశా నుంచి పడవలపై గోవులను తరలిస్తూ మాఫియా రెచ్చిపోతోంది.
Chintoor: సీలేరు నది సాక్షిగా కోట్లలో గోవుల అక్రమ రవాణా దందా!
చింతూరు: చింతూరు ఏజెన్సీ మొత్తం ఇప్పుడు ఇదే గుసగుసలాడుతోంది. మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లు... గో వ్యాపారం జోరుగా సాగుతోంది. గోమాతలు కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రజల గుండెలు తరుక్కుపోతున్నాయి. ఒరిస్సా వైపు గ్రామాల్లో బేరం ఫిక్స్... అక్కడ గోవులను కొని, పడవకు రెండు వైపులా తాళ్లతో బిగించి, సీలేరు నదిని దాటిస్తారు. నీళ్లలో మునిగి తేలుతూ... భయంతో అరుస్తూ... ఆ మూగ జీవాల ఆర్తనాదం నది అలల్లోనే కలిసిపోతుంది.
ఆంధ్రా ఒడ్డున దిగగానే... కొత్తపల్లి, వేములరాయి, నేలకోట... ఈ మూడు గ్రామాలే మాఫియాకు అడ్డాలు! అక్కడి నుంచి రహదారి మార్గంలో తోలుకుంటూ ఓ సేఫ్ ప్రదేశానికి చేర్చుతారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలు రెడీగా ఉన్న వ్యానులు, కంటైనర్లు, లారీలు... గోకవరం, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, హైదరాబాద్ వైపు దూసుకుపోతాయి. ఒక్కో ట్రిప్ వెనుక లక్షల లెక్క! చింతూరుకు చెందిన కొందరు, గోకవరానికి చెందిన ఓ మరికొందరు స్థానికులు కలిసి... ఈ మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కానీ ప్రశ్న ఒక్కటే... అరికట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు?
చెక్ పోస్టులు ఉన్నాయి... గస్తీ ఉంది... అయినా పడవలు ఎలా దాటుతున్నాయి? లారీలు ఎలా దూసుకుపోతున్నాయి? అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్న ఆరోపణలు ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గోమాతలను కాపాడే వారే లేరా? ఈ దందాకు అడ్డుకట్ట వేసే దమ్మున్న అధికారి ఎక్కడ? అని ప్రజలు అడుగుతున్నారు.




