Nidadavolu: పందలపర్రులో తుపాను పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్!

Nidadavolu: నిడదవోలు మండలం పందలపర్రులో అర్ణాబ్ తుపాను వల్ల దెబ్బతిన్న వరి, అరటి తోటలను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 28 Oct 2026 10:42 PM IST
Nidadavolu
X

Nidadavolu: పందలపర్రులో తుపాను పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్!

నిడదవోలు: అర్నాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావంతో నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో నేలమట్టమైన వరి పంట పొలాలు, అరటి తోటలను మంత్రి కందుల దుర్గేష్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.

సుమారు 600 ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. రేయింబవళ్లు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుఫాన్ పాలవ్వడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పంట నష్టం తీవ్రతను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు తమ పంట పొలాల్లోకి రాకపోకలు సాగించడానికి వీలుగా అవసరమైన చోట పుంత రోడ్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

అంతకుముందు నిడదవోలు పట్టణంలోని 15వ వార్డు రాయిపేటలో భారీ వృక్షాలు కూలిపోయాయన్న సమాచారం అందుకున్న మంత్రి దుర్గేష్ తక్షణమే అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై అడ్డుగా పడిన చెట్లను వెంటనే తొలగించి, ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్‌లో ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో అధికారులు తక్షణమే ప్రొక్లెయిన్‌ సాయంతో చెట్లను తొలగించి రహదారిని పునరుద్ధరించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్‌కు స్థానిక ప్రజలు, రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 5 లక్షల లబ్ధి పొందిన మరియమ్మ అనే మహిళ పందలపర్రు గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE