Rajahmundry: తుపాను వేళ ఎమ్మెల్యే వాసు సేవలు అభినందనీయం!
Rajahmundry: అర్నాబ్ తుపాను వేళ రాజమండ్రి ఎమ్మెల్యే వాసు చేపట్టిన సేవలను కూటమి నేతలు మెచ్చుకున్నారు. 24 గంటల్లో విద్యుత్, అర్ధగంటలోనే నీటిని తొలగించారన్నారు.
Rajahmundry: తుపాను వేళ ఎమ్మెల్యే వాసు సేవలు అభినందనీయం!
Rajahmundry: అర్నాబ్ తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి, విద్యుత్, డ్రైనేజీ సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమర్థవంతంగా వ్యవహరించారని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు యర్నాగుల శ్రీను ప్రశంసించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారులను సమన్వయం చేసి సహాయక చర్యలను వేగవంతం చేసిన ఎమ్మెల్యే సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ.. తుపాను హెచ్చరికలు వెలువడిన వెంటనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 42 డివిజన్లలోని కూటమి నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేశారని తెలిపారు. ప్రతి వార్డులోనూ నాయకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారన్నారు.
టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ముంపు ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలినప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎమ్మెల్యే స్వయంగా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారని, 24 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో వర్షాలు కురిస్తే నగరంలోని పలు ప్రాంతాలు రోజుల తరబడి ముంపులో ఉండేవని, ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ముంపు ప్రాంతాల్లో అరగంట వ్యవధిలోనే నీటిని తొలగించేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.
హుదూద్ తుపాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మానుకుని ప్రజల మధ్యకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించకుండా, కేవలం రీల్స్ చేస్తూ, అభివృద్ధి పనులపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరి కాదని స్థానిక వైకాపా నాయకులకు సూచించారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం, రాజమహేంద్రవరం నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.22 కోట్లు, అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు, నగరంలోని ఆరు డివిజన్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.
హావ్లాక్ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా వాటర్ పైప్లైన్లు, అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు కోసం కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తవ్వాల్సి వస్తోందని, తాత్కాలిక ఇబ్బందులను చూపించి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు.
తుపాను సమయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్య ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని, బీజేపీ తరఫున ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని చెప్పారు. నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని సమకూర్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై. శ్రీను మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
తుపాను సమయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఫోన్ కాల్స్‌కు స్పందిస్తూ, సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెంటనే చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో 850 మందికి పైగా లబ్ధిదారులకు రూ.7 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సి ఎం ఆర్ ఎఫ్) అందేలా ఎమ్మెల్యే వాసు కృషి చేశారని అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూడా నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారని చెప్పారు. రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి, స్పోర్ట్స్ కాంప్లెక్స్, భూగర్భ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ వంటి శాశ్వత అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించి పరిష్కారానికి సహకరించాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి రాజేంద్రప్రసాద్, బూర రామచంద్రరావు, చొప్పర్ల భద్రరావు, అడబాల రామకృష్ణ, జామ్మి సత్యనారాయణ, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.




