Rajahmundry: బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!

Rajahmundry: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 3 Oct 2026 1:52 PM IST
Rajahmundry
X

Rajahmundry: బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!

Rajahmundry: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. జేఎన్ రోడ్డులోని వి. కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ న్యాయస్థానంలో సవాలు చేసిందన్నారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను ఎందుకు సవాలు చేశారో ప్రజలకు వివరించాలని వైకాపా నేతలను ప్రశ్నించారు.

గతంలో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రూ.30 లక్షలతో దివ్యాంగులకు సహాయ పరికరాలు

గెయిల్ సీఎసఆర్ నిధులతో సుమారు రూ.30 లక్షల విలువైన సహాయ పరికరాలను దివ్యాంగులకు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టామని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే 800 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.

మొదట రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావించినప్పటికీ, కొవ్వూరు, అనపర్తి తదితర ప్రాంతాల నుంచి కూడా దివ్యాంగులు వచ్చి సహాయం కోరుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పరిధితో సంబంధం లేకుండా అవసరమైన వారికి సహాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

అవసరమైతే మరిన్ని సీఎసఆర్ నిధులు సమీకరించి అదనంగా సహాయం అందిస్తామని చెప్పారు. గత రెండేళ్లలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల సీఎసఆర్ నిధులు తీసుకువచ్చి వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని, వాటి వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం

నగరంతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ నగరం పట్ల గౌరవం, బాధ్యత ఉండాలన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను రాజకీయ విమర్శలకు మాత్రమే ఉపయోగించకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

నగరాభివృద్ధిలో భాగంగా రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమృత్ 2.0 వంటి పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. కంబాలచెరువు జంక్షన్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.25 కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు.

నల్లచానల్ వద్ద అదనపు వెంటు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హైటెక్ బస్టాండ్ ప్రాంతంలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి రూ.6 కోట్లు, కార్పొరేషన్ నుంచి రూ.2 కోట్లు కేటాయించి త్వరలో టెండర్లు పిలవనున్నట్టు వివరించారు. వీఎల్‌పురం జంక్షన్‌లో కూడా వర్షపు నీరు త్వరగా తొలగిపోయేలా చర్యలు చేపట్టామన్నారు.

కాగా రాజమహేంద్రవరం ఒక నగరం మాత్రమే కాదు. మనందరికీ ఒక ఎమోషన్. నగరం గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY