Kadiyam: కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

Kadiyam: కడియం మండలంలో మంత్రులు నిమ్మల, దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 21 Sept 2026 5:36 PM IST
Kadiyam
X

Kadiyam: కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

Kadiyam: కడియం మండలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని, పనులను ప్రారంభించారు.

పొట్టిలంకలో 4.88 కోట్లతో నిర్మించనున్న డబుల్‌ లేన్‌ వంతెనకు శంకుస్థాపనలు చేశారు. నూతనంగా నిర్మించిన వెల్నెస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. కడియపులంక, మాధవరాయుడుపాలెం గ్రామాలలో 7.87 కోట్ల సాస్కి నిధులతో నిర్మించనున్న రహదారులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పొట్టిలంకలో జరిగిన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పొట్టిలంక వంతెన నిర్మాణం పరిసర గ్రామాల ప్రజల చిరకాల అవసరమని తెలిపారు.

వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కృషిని అభినందించారు. వంతెన పూర్తయితే మడికి, పొట్టిలంక, కడియపులంక, బడుగువానిలంక తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పొట్టిలంక వంతెన కోసం ప్రజలు దాదాపు 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు ఆ కల సాకారం అవుతోందన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే గోరంట్ల చేస్తున్న నిరంతర కృషిని మంత్రి అభినందించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వినియోగిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.

రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పొట్టిలంక వద్ద నిర్మించనున్న డబుల్‌ లేన్‌ వంతెనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను కోరారు. ఈ వంతెనతో నాలుగు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వేమగిరి వద్ద మంజూరైన వంతెన నుంచి పొట్టిలంక వరకు జాతీయ రహదారి పక్కన సర్వీసు రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కడియం మండలంలో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర సర్వే నిర్వహించి అవసరమైన ప్రాంతాల్లో డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, పంతం గణపతి, ఏపీఐఐసీ డైరెక్టర్‌ మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి నాని, తహసీల్దార్‌ ఎం శ్రీనివాస్‌, ఎంపీడీవో కె రమేష్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL