Nidadavolu: నిడదవోలులో రూ.28.89 కోట్లతో 24 రోడ్ల నిర్మాణ పనులు!
Nidadavolu: నిడదవోలులో రూ.28.89 కోట్లతో 24 రోడ్ల పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన నెల రోజుల్లో కొత్త పింఛన్లు, త్వరలో ఇళ్ల స్థలాలు, గత పాలనపై తీవ్ర విమర్శలు.
Nidadavolu: నిడదవోలులో రూ.28.89 కోట్లతో 24 రోడ్ల నిర్మాణ పనులు!
నిడదవోలు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంతెనింగ్ ప్రాజెక్ట్( పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్) నిధుల క్రింద మంజూరైన రూ. 28.89 కోట్ల నిధులతో 45 కి. మీ పొడవైన 24 రహదారి నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు,పెరవలి మండలం ఉసలుమర్రు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని నిడదవోలు రూరల్, పెరవలి, ఉండ్రాజవరం మూడు మండలాల్లో రహదారుల అభివృద్ధికి రూట్ మ్యాప్ సిద్ధం చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెరవలి మండలంలో 12 కి.మీ. పొడవు గల 6 రహదారి పనులకు రూ. 6.25 కోట్లు, ఉండ్రాజవరం మండలంలో 18 కి.మీ. పొడవు గల 8 రహదారి పనులకు రూ. 13.20 కోట్లు, నిడదవోలు మండలంలో 14 కి.మీ. పొడవు గల 10 రహదారి పనులకు రూ. 9.44 కోట్లు కేటాయించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
పందలపర్రు గ్రామంలో రోడ్ల అభివృద్ధికి సుమారు రూ. 3 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా పందలపర్రు ఆంజనేయ స్వామి గుడి నుండి ఏటిగట్టు వరకు రహదారి నిర్మాణానికి రూ. 1.24 కోట్లు,పందలపర్రు నుండి రావివారిపాలెం వెళ్లే రహదారి నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించామని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో సాగుతున్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రధానంగా 'సూపర్ సిక్స్' హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయని, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 'శాస్కి' (SASCI - Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి రూ. 28 కోట్లు కేటాయించామన్నారు.
ఇప్పటికే పల్లె పండుగ 1.0, 2.0 ద్వారా నియోజకవర్గంలో పలు రోడ్లు నిర్మించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రోడ్డుపై కనీసం తట్టెడు మట్టి కూడా వేయని దుస్థితి ఉండేదని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో అందమైన రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కేవలం అరాచకాలు చేసి అధికారాన్ని అనుభవించిందే తప్ప, కనీసం ఒక కొత్త రోడ్డు కూడా వేయలేదని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకనే కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం విషయానికొస్తే... ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించామని, మరో నెల రోజుల్లో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన గృహసముదాయాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణను స్వయంగా ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించడం జరిగిందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఈ పర్యటనలో భాగంగా పందలపర్రు గ్రామంలోని అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




