Nidadavole: రూ. 45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి!

Nidadavole: నిడదవోలు పట్టణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ. 45 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 22 Sept 2026 4:43 PM IST
Nidadavole
X

Nidadavole: రూ. 45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి!

Nidadavole: నిడదవోలు పట్టణాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం నిడదవోలు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు.

ప్రభుత్వ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో రూ.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు సెంట్రల్ డివైడర్, లైటింగ్, రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పన పనులకు మంత్రి కందుల దుర్గేష్ శాస్త్రోక్తంగా పూజలు చేసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు 27వ వార్డు సమీపంలోని అన్నక్యాంటీన్ పక్కన లిటిల్ ప్యారడైస్ స్కల్ వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్చువల్ విధానంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం 22వ వార్డులోని వైఎస్సార్ కాలనీలో రూ.67 లక్షల 15 వ ఆర్థిక సంఘం, మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రహరీగోడ, సీసీ రోడ్డు నిర్మాణాలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. అదే విధంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.5.96 కోట్ల అంచనా వ్యయంతో 18,22 వార్డులలోని ఎన్టీఆర్ కాలనీలు మరియు వీకర్ సెక్షన్ కాలనీలకు త్రాగునీటి సరఫరా కల్పించే పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గృహ సముదాయాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిడదవోలు పట్టణంలో రెండున్నరేళ్లలో సుమారు రూ.300 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

ఎన్టీఆర్ కాలనీలో రూ.6 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామన్నారు.సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల సహకారంతో నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ కాలనీ లో అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేశామని, త్వరలోనే అండర్ రోడ్డు కూడా సాకారం చేస్తామని హామీనిచ్చారు.

స్థానిక ఫిర్యాదుల మేరకు 48 గంటల్లో సమీపంలోని ప్రధాన రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా, విద్యార్థులు పాఠశాలకు సజావుగా వెళ్లేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ అభివృద్ధి,సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE