Nidadavole: మున్సిపల్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన మంత్రి దుర్గేష్!

Nidadavole: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 28 Oct 2026 2:30 PM IST
Nidadavole
X

Nidadavole: మున్సిపల్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన మంత్రి దుర్గేష్!

Nidadavole: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను అవలంబిస్తూ దూసుకుపోతున్నారు. కేంద్రం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో గత రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో రూ. 195 కోట్ల నిధులతో నిడదవోలు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లి కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ బుధవారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.

భారీ ఈదురుగాలులు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణంలోని 9, 10, 15, 16, 17, 19, 20, 29 వార్డులలో కూటమి అభ్యర్థులు అంగర లక్ష్మీ (టీడీపీ), షకీనా అన్నారి బేగం (టీడీపీ), కేదారిశెట్టి హారిక (జనసేన), బలిజేపల్లి వెంకట బదిరి లక్ష్మీ వైశాలి (బీజేపీ), బైపే రాజేశ్వరరావు (టీడీపీ), పితాని నాగమణి (జనసేన), బొచ్చ సూర్యకుమారి (జనసేన), నెల్లూరి జ్యోతి (జనసేన) తరఫున ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులను స్థానిక ప్రజలకు స్వయంగా చూపుతూ, "ఈ రోడ్డును ఎవరు నిర్మించారు?" అని స్థానికులను అడిగి స్పష్టత నిచ్చారు. వీటిని నిర్మించింది కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నేతలు ఈ పనులపై అసత్య ప్రచారాలు చేసుకోవడం, క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం శోచనీయమన్నారు.

గతంలో దుర్గంధభరితంగా ఉన్న మాలకోడు చెరువును రూ.5 కోట్లతో నిడదవోలుకే ఐకాన్‌గా, సుందర నందనవనంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, మధ్యలో వాటర్ ఫౌంటెన్, ఆహ్లాదకరమైన పార్కు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరో 2-3 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే రూ.50 లక్షలతో సమిశ్రగూడెం చెరువును కూడా ఆధునీకరిస్తున్నామని వివరించారు.కూటమి ప్రభుత్వ దార్శనికతకు, ఆలోచనకు, దూరదృష్టికి ఈ చెరువు పనులే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు..

గత వైకాపా ప్రభుత్వం నిధులు మళ్లించి అమృత్ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాన్ని పునరుద్ధరించి శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా అందించే పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఎస్టీపీ ఏర్పాటు ద్వారా పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

వర్షాల సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్ ఆధునీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

రూ.3 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు తీసుకొచ్చి దళితవాడల్లో మరింతగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి మౌలిక వసతులతో 1252 మంది టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఆర్ఓబిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.. 100 పడకల ఆసుపత్రి కల నెరవేరుస్తామన్నారు.. మినీ స్టేడియం తెచ్చి ప్రతిభకు పెద్దపీట వేస్తామన్నారు.. రూ 45 కోట్ల హ్యామ్ నిధులతో పట్టణంలో మరిన్ని రహదారులు, డ్రైన్ లను నిర్మించి పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

విద్యావంతురాలైన చైర్‌పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతితో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిల్‌లో ఎక్స్-అఫీషియో మెంబర్‌గా తాను మరిన్ని నిధులు తీసుకువచ్చి నిడదవోలును రాష్ట్రంలోనే నంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

తమను గెలిపించిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని పేర్కొంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రజలను కోరారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికే తమ ఓటు అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE