Mummidivaram: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: ముమ్మిడివరంలో భారీ ధర్నా
Mummidivaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రూ.26 వేల కనీస వేతనం, బకాయిల చెల్లింపు కోరుతూ ఆశా వర్కర్లు భారీ ధర్నా, ర్యాలీ చేపట్టారు.
Mummidivaram: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: ముమ్మిడివరంలో భారీ ధర్నా
అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముమ్మిడివరం నియోజకవర్గం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎయిమ్స్ కాలేజీ వద్ద ఉన్న డీఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించారు.
ఆశా వర్కర్లకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని, గర్భిణీలకు ప్రసూతి సెలవులు, కొత్త నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుష్టు వ్యాధి సర్వేలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, పింఛన్ల అర్హతలను వర్తింపజేయాలని కోరారు.
విధులకు అవసరమైన నాణ్యమైన యూనిఫాములు, స్మార్ట్‌ఫోన్లు, 26 రకాల రికార్డులను ఉచితంగా అందించాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌సీ టార్గెట్ల పేరుతో వేధింపులు, వెల్నెస్ సెంటర్లలో బలవంతపు పనివేళలను నిలిపివేయాలని కోరారు.
కొత్తగా విధుల్లో చేరిన ఆశా వర్కర్లకు నెలకు 2,800 రూపాయల చొప్పున నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి. దుర్గాప్రసాద్, ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి. ఎస్తేర్ రాణి, ప్రధాన కార్యదర్శి మలక సుభాషిని తదితరులు, పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.




