Mandapeta: మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక క్లీన్ స్వీప్: 36/36 విజయం!
Mandapeta: మండపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం. మొత్తం 36 వార్డులకు 36 క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన వేగుళ్ల అజయ్ బాబు నేతృత్వం.
Mandapeta: మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక క్లీన్ స్వీప్: 36/36 విజయం!
Mandapeta: మండపేట పురపాలక సంఘ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తూ మొత్తం 36 వార్డులకు 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం లేకుండా సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ అపూర్వ విజయంతో మండపేట రాజకీయ చరిత్రలో కూటమి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
మండపేట పట్టణం ఏర్పడిన నాటి నుంచి పురపాలక ఎన్నికల్లో ఇలాంటి సంపూర్ణ విజయం ఎప్పుడూ చూడలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో 1981–82 ప్రాంతంలో సర్దార్ వేగుళ్ల వీర్రాజు ప్యానల్, అప్పటి దివంగత ఎమ్మెల్యే వల్లూరు నారాయణమూర్తి ప్యానల్‌తో హోరాహోరీగా తలపడి విజయం సాధించిన సందర్భం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వేగుళ్ల వీర్రాజు ప్యానల్ స్వీప్ చేసినట్లు పట్టణ రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి.
అయితే ఇప్పుడు అదే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ తాతకు తగ్గ మనవడిగా వేగుళ్ల అజయ్ బాబు నేతృత్వంలోని కూటమి మరో చరిత్ర సృష్టించింది. మొత్తం 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
అధికారులు వరుసగా వార్డుల వారీగా ఫలితాలను ప్రకటిస్తున్న కొద్దీ కూటమి శ్రేణుల్లోఉత్సాహం రెట్టింపైంది. టీడీపీ పోటీ చేసిన 24 వార్డుల్లోనూ 24 స్థానాలను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. జనసేన పోటీ చేసిన 10 వార్డుల్లోనూ విజయభేరి మోగించింది. మరో రెండు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి కూటమి విజయాన్ని సంపూర్ణం చేశారు.ఈ విధంగా టీడీపీ 24, జనసేన 10, బీజేపీ 2 స్థానాలతో మొత్తం 36 వార్డులను క్లీన్ స్వీప్ చేయడం మండపేట రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. కూటమి పార్టీల సమన్వయం, నాయకత్వం, కార్యకర్తల సమష్టి కృషి, ప్రజల మద్దతు ఈ అఖండ విజయానికి కారణమయ్యాయని కూటమి శ్రేణులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన వారసుడిని గ్రాండ్ లాంచ్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తంగా మండపేట పురపాలక సంఘంపై కూటమి సంపూర్ణ ఆధిపత్యం సాధించడంతో పట్టణంలో విజయోత్సాహం వెల్లివిరిసింది. గత రికార్డులను అధిగమించి 36కు 36 వార్డులను గెలుచుకోవడం ద్వారా వేగుళ్ల అజయ్ బాబు నాయకత్వం మండపేట రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందనుంది.




