Mamidikuduru: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి: అఖిలపక్షాల డిమాండ్
Mamidikuduru: మామిడికుదురులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఓట్ల తొలగింపుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Mamidikuduru: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి: అఖిలపక్షాల డిమాండ్
మామిడికుదురు: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మామిడికుదురు మండల అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్‌లో అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “భారతదేశంలో ఎన్నికల సాధికారత–ఎలక్షన్ కమిషన్ తీరు తెన్నులు” అంశంపై అఖిలపక్షాల సమావేశం నిర్వహించారు. సామాజిక కార్యకర్తలు నీతిపూడి చందర్రావు, భూపతి వెంకటపతి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఓటర్ల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ‘SIR’ ప్రక్రియ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేసి, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఓట్ల అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం నాయకులు కలిగితి పల్లంరాజు, బత్తుల జనార్దన్‌రావు, బొంతు మణిరాజు, నీతిపూడి మహేష్, కోట రామచంద్రరావు, నెల్లి దుర్గాప్రసాద్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎ.రాజేష్, ముత్యాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




