Malikipuram: జెడ్పీహెచ్‌ఎస్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు
Malikipuram: మలికిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చదువుల ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Malikipuram: జెడ్పీహెచ్‌ఎస్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు
మలికిపురం: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మలికిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయిని డి. ఆశాజ్యోతి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను వివరిస్తూ సందేశాత్మక స్కిట్‌ను ప్రదర్శించారు.
చదువుల ఒత్తిడి, పరీక్షల భయం, కుటుంబ సమస్యలు, తోటి విద్యార్థుల వేధింపులు వంటి అంశాలను స్కిట్ ద్వారా వివరించారు. మానసిక సమస్యలను దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు కౌన్సెలర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యలతో బాధపడేవారిని అర్థం చేసుకుని అండగా నిలవాలని సందేశమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. చిట్టిబాబు, కె. సునీల్, కె.వి.ఎల్.ఎన్. బాబా, ఎన్. విజయ్ బాబు, ఎం.డి. అబ్దుల్ రహీమ్, ఎం. సాంబశివరావు, జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పి.వి.వి. వరప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
"'మానసిక ఆరోగ్యం మన హక్కు – మనసులోని మాటను పంచుకుందాం, ఒకరికొకరం అండగా నిలుద్దాం'" అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.




