Malikipuram: లక్కవరంలో రోడ్డుపై గ్రామస్తుల ధర్నా: తక్షణ మరమ్మతులకు డిమాండ్
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో అధ్వాన రోడ్లను బాగుచేయాలని, బాగున్న రోడ్లు తవ్వడం ఆపాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
Malikipuram: లక్కవరంలో రోడ్డుపై గ్రామస్తుల ధర్నా: తక్షణ మరమ్మతులకు డిమాండ్
మలికిపురం: మండలంలోని లక్కవరం గ్రామంలో ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తంగా మారిన రహదారులను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామంలోని నాలుగైదు ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఈ రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
ఇదిలా ఉండగా, రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం హయాంలో నిర్మించిన, ఎలాంటి గుంతలు లేకుండా సక్రమంగా ఉన్న రోడ్డును సైతం ధ్వంసం చేసి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లను పట్టించుకోకుండా బాగున్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు అత్యవసరంగా అవసరమైన రోడ్లను గుర్తించి, అస్తవ్యస్తంగా మారిన గుంతల రోడ్లకు ముందుగా మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నడవడానికి, వాహనాలపై ప్రయాణించడానికి కూడా ఇబ్బందిగా ఉన్న రోడ్లను తక్షణమే అభివృద్ధి చేసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.




