Lakkavaram: కోటిపల్లి-నరసాపురం రైల్వే నిధుల విడుదలపై సంబరాలు

Lakkavaram: కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. లక్కవరంలో మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం.

PRABHU, RAZOLE
Published on: 3 Oct 2026 5:24 PM IST
Lakkavaram
X

Lakkavaram: కోటిపల్లి-నరసాపురం రైల్వే నిధుల విడుదలపై సంబరాలు

లక్కవరం: కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరంలో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి, కూటమి నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.100 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల విడుదలతో రైల్వే ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడిందని పేర్కొన్నారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైల్వే ప్రాజెక్టుపై ఆశలు మరింత బలపడ్డాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి మాట్లాడుతూ, “మా నాన్నగారి చిరకాల కల నెరవేరే సమయం వచ్చింది. కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ పూర్తవడం ద్వారా ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుంది” అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను కూడా త్వరితగతిన తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టు పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ప్రజలకు ప్రయాణ సౌలభ్యం, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని కూటమి నేతలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE