Ravulapalem: కొత్తపేటలో కూటమి ఘనవిజయం.. ఎన్డీఏ పాలనకు నిదర్శనం

Ravulapalem: కొత్తపేటలో 4 జడ్పీటీసీలు, 75 ఎంపీటీసీలు కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి. రావులపాలెంలో 40 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 9 Nov 2026 3:57 PM IST
Ravulapalem
X

Ravulapalem: కొత్తపేటలో కూటమి ఘనవిజయం.. ఎన్డీఏ పాలనకు నిదర్శనం

రావులపాలెం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ఎన్డీఏ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, భాజపా నేత తమలంపూడి రామకృష్ణారెడ్డి, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముందుగా మండల,జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి పాలన నిరంతరం కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారనడానికి దర్పణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కనిపిస్తుందన్నారు.

కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు జడ్పిటీసీలు, 86 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 75 ఎంపీటీసీ స్థానాలు కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారన్నారు. నాలుగు జడ్పిటీసీలను కూటమి అభ్యర్థులు గెల్చుకున్నారన్నారు. ఈ విధంగా ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు.

ఇప్పటికీ ఏడుసార్లు మండల పరిషత్ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు పొందని ఫలితాలు సైతం తెలుగుదేశం, జనసేన, భాజపా తరపున ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ఎన్టీ రామారావు 1986లో మండల వ్యవస్థ ఏర్పాటు చేశాక రావులపాలెం మండల పరిషత్ లో ఆరు దఫాలుగా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిందని అయితే సఫలం కాలేదన్నారు.

40 సంవత్సరాల తర్వాత ఏడవ సారి జరిగిన ఈ మండల పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మండల పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవడమనేది చారిత్రాత్మక విజయంగా,గొప్ప రికార్డుగా ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ సందర్భంగా రావులపాలెం ఎంపీపీగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళకు అవకాశం రావడం మరింత సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన తరగతులకు ఉన్న అనుబంధం ఎటువంటిదో అందరికీ తెలిసిందేనన్నారు.

కనుక తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా దక్కిన రావులపాలెం ఎంపీపీ స్థానం వెనుకబడిన తరగతులకు చెందిన నాయకురాలికి దక్కడం మరింత సంతోషంగా కలిగిస్తుందన్నారు. రావులపాలెం మండల పరిషత్ లో 24 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 17 స్థానాలు కూటమి కైవసం చేసుకుందన్నారు. రావులపాలెంలో ఆరు ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఆరు ఎంపీటీసీలు తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం గొప్ప విశేషంగా ఆయన తెలియజేశారు.

రావులపాలెంలో అత్యంత సామాన్యులు ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా పోటీ చేశారని, ఈ ఎన్నికలు సామాన్యులకు ఆర్థికంగా బలమైన వారికి మధ్య జరిగిన ఎన్నికలుగా పేర్కొనవచ్చన్నారు. ఒక లారీ డ్రైవర్ సతీమణి, చిన్న టీ దుకాణం యజమాని ఇలా ఏమాత్రం ఆర్థికంగా వెన్నుదన్ను లేనివారే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారని తెలిపారు. అటువంటిది సామాన్యులను అందలం ఎక్కిస్తూ ఆరు ఎంపీటీసీ స్థానాలను గెలిపించిన రావులపాలెం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో రావులపాలెంలో ఎవరి ఓటు వారు వేసుకోవడానికి స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేసుకొని ప్రజా తీర్పును బలంగా ఇచ్చారన్నారు. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం గోపాలపురంలో సైతం ఎన్డీఏ కూటమి తరుపున 2 ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం,జనసేన పార్టీలు కైవసం చేసుకున్నాయన్నారు.

1995లో గోపాలపురంలో ఇటువంటి విజయం సాధించామని మరలా 30 సంవత్సరాల తర్వాత ఆ విధంగా రెండు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడం జరిగిందన్నారు. గోపాలపురం గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మొత్తం నియోజకవర్గంలో 75 ఎంపీటీసీ స్థానాలు కూటమి గెలుచుకుంటే వైసిపి 11 స్థానాలు మాత్రమే గెలుచుకుందన్నారు.

11 స్థానాల్లో కూడా అత్యంత తక్కువ మెజారిటీతో ఐదారు స్థానాలు కూటమి కోల్పోవడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పాలన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చాలా అవసరమని ప్రజలు తీర్పునిచ్చారన్నారు. చెప్పాము, చేస్తున్నాము, చేస్తాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రజలతో చెప్పమన్నారని,స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తాము అదే చెప్పామన్నారు.

మంచి పరిపాలన అందిస్తాము, సంక్షేమం అందిస్తాము, అభివృద్ధి చేస్తాము అని తాము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారన్నారు. జరుగుతున్న పాలన పట్ల ప్రజలు సంతృప్తి చెందారన్నారు. 2024 ఎన్నికల్లో వైసిపి 151 నుంచి పడిపోయి 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే, నేడు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నియోజకవర్గంలో 11 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చన్నారు.

స్థానిక సంస్థల్లో కూటమి అధికారంలో ఉంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా స్థిరమైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వంపై ఎన్నికల ముందు చాలామంది చాలా దుష్ప్రచారాలు చేశారని విమర్శించారు. లేనిపోని నిరాధార ఆరోపణలు చేశారన్నారు. తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. వ్యక్తిగతంగా బురద జల్లారన్నారు.

ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం ఎవరు పని చేస్తున్నారు? గతంలో ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఈ రెండున్నర ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది?ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుందని గమనిస్తూనే ఉన్నారన్నారు. జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకనే ఇంత గొప్ప విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు.

మాయ మాటలతోటి, మోసపూరితమైన మాటలతోటి ప్రజల మనసులను గెలవలేరని ఈ ఎన్నికలు నిరూపించాయని ఎమ్మెల్యే బండారు అన్నారు. సామాన్యులకు ఈ ఎన్నికల్లో ఏ విధంగా అవకాశాలు లభించాయో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వెనుకబడిన వర్గాల కోసం, సామాన్యుల కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం, మహిళల కోసం ఎన్టీ రామారావు నాడు ఏర్పాటుచేసిన సిద్ధాంతాలను అనుసరించే ముందుకు వెళ్తామని తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఎంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఈ స్థానిక సంస్థల విజయం వారికే దక్కుతుందన్నారు. ఏ పార్టీ?ఏ నాయకుడు?అభ్యర్థి ఎవరు? అనేది చూడకుండా రేయింబవళ్లు శ్రమించి నేనే అభ్యర్థిని అన్నట్లుగా అందరూ కలిసి పని చేసి ఈ విజయాన్ని అందించారని కొనియాడారు. అందుకే కూటమి నాయకులకు, కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు.

ప్రజలు సైతం ఎంతో ఆదరాభిమానాలతో గొప్పగా ఆలోచించి ఈ విజయాన్ని కట్టబెట్టారని, ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్నారు. ప్రజలు కోరుకునేది మంచి పరిపాలన, స్థిరమైన అభివృద్ధి అన్నారు. శాసనసభ్యునిగా తాను చేస్తున్న మంచి పనులకు అండగా ఉండాలని ప్రజలు ఇంతటి విజయం అందజేశారన్నారు.రాబోయే పంచాయితీ ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థులని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA