Kothapeta: అక్రమ సంబంధం నేపథ్యంలో యువకుడి హత్య.. నిందితుడి అరెస్ట్

Kothapeta: కోనసీమ జిల్లా మడికి నర్సరీలో జరిగిన మింగి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడు గంపా దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Updated on: 7 Oct 2026 2:38 PM IST
Kothapeta
X

Kothapeta: అక్రమ సంబంధం నేపథ్యంలో యువకుడి హత్య.. నిందితుడి అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం: ఆలమూరు మండలం మడికి గ్రామంలోని నర్సరీలో గత నెల 29న జరిగిన మింగి రమేష్ (24) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న గంపా దుర్గాప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బుధవారం ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి. నరేష్ కేసు వివరాలను వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. నిందితుడు గంపా దుర్గాప్రసాద్, అతని భార్య అనూష 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడటంతో అనూష గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో అనూషకు మృతుడు మింగి రమేష్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 29న అర్ధరాత్రి అనూష ఇంటి నుంచి రమేష్ బయటకు రావడాన్ని గమనించిన దుర్గాప్రసాద్ అతడిని నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

ఆగ్రహంతో దుర్గాప్రసాద్ రమేష్‌ను చాకుతో పొట్టలో పొడిచి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు సీఐ తెలిపారు.

హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడిని గుర్తించి మంగళవారం సాయంత్రం మడికి గ్రామంలో అరెస్ట్ చేశారు.

నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన చాకు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA