Amalapuram: అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్‌కు వీఆర్ఏల వినతిపత్రం
Amalapuram: కోనసీమ జిల్లావ్యాప్తంగా వీఆర్ఏల సమ్మె ఏడో రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Amalapuram: అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్‌కు వీఆర్ఏల వినతిపత్రం
అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఏపీ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో వీఆర్ఏలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సుమారు రూ.10 వేల గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలాకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని తెలిపారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని, నామినీగా విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రమోషన్ కోటాను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పదోన్నతులు తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు కోరారు.
ఈ నేపథ్యంలో తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగికి వీఆర్ఏలు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.




