Konaseema: కోనసీమలో పరిషత్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రత.. ఎస్పీ రాహుల్ మీనా
Konaseema: అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం కౌంటింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 నిషేధాజ్ఞలు, ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి.
Konaseema: కోనసీమలో పరిషత్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రత.. ఎస్పీ రాహుల్ మీనా
కోనసీమ: అమలాపురం,రామచంద్రపురం, కొత్తపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపులు,ప్రత్యేక నిఘా బి.ఎన్.ఎస్ ఎస్ సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు,ఊరేగింపులకు అనుమతి లేదు అని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎంపీటీసీ జడ్పీటీసీ లలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు,రాజకీయ నాయకులకు,వివిధ పార్టీల అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐ.పి.ఎస్ ధన్యవాదాలు తెలియజేశారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, ఫ్రిస్కింగ్,గుర్తింపు కార్డుల తనిఖీలు, నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించని వస్తువులు,మొబైల్ ఫోన్లు తీసుకెళ్లరాదు.కౌంటింగ్ ఏజెంట్లు నియామక పత్రాలు,గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
నిషేధాజ్ఞలు – శాంతిభద్రతలు:
BNSS సెక్షన్ 163 ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడరాదు.అనుమతి లేకుండా సమావేశాలు,ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు.ఘర్షణలకు దారితీసే చర్యలు,రెచ్చగొట్టే నినాదాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంది.
ట్రాఫిక్ మళ్లింపులు:
అమలాపురం: ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా అమలాపురం పట్టణంలో 07/11/2026 తేదీ
పట్టణ ప్రయాణికులు మరియు వాహనదారులు ఇబ్బంది పడకుండా ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను గమనించవలసిందిగా సూచించడమైనది.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు (ఉదయం 5:00 నుండి సాయంత్రం 7:00 వరకు)
1) ఈదరపల్లి వంతెన నుండి రాజోలు వైపు వెళ్ళు వాహనాలు:
బ్లాక్ బ్రిడ్జ్ ➔ రెడ్ బ్రిడ్జ్ ➔ కిమ్స్ కాలేజ్ ➔ భట్నవిల్లి వై జంక్షన్ (Y-Junction) మీదుగా వెళ్ళాలి.
2) రాజోలు వైపు నుండి రావులపాలెం / అయినవిల్లి వెళ్ళు వాహనాలు:
పేరూరు వై జంక్షన్ ➔ భట్నవిల్లి వై జంక్షన్ ➔ కిమ్స్ కాలేజ్ ➔ రెడ్ బ్రిడ్జ్ ➔ బ్లాక్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలి.
గమనిక: లెక్కింపు కేంద్రం (SKBR కాలేజ్) పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ఈ దిశగా ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రయాణించవలసిందిగా కోరడమైనది.
కొత్తపేట: ఈ నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 07.11.2026వ తేదీ ఉదయం 07:00 గంటల నుండి రాత్రి 09:00 గంటల వరకు క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది.
రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం:
రావులపాలెం – బోడిపాలెంబ్రిడ్జ్ – వాడపాలెం – అడ్డకాలువ – వానపల్లి – ముక్తేశ్వరం మీదుగా అమలాపురం చేరుకోవాలి.
అమలాపురం నుండి రావులపాలెం వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం:
అమలాపురం – పలివెల వంతెన – పలివెల గ్రామం – గంటి చెక్‌పోస్ట్ – ఈతకోట మీదుగా రావులపాలెం చేరుకోవాలి. కావున, వాహనదారులందరూ ఈ ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను గమనించి, పోలీసు సిబ్బందికి సహకరించాలని, ప్రయాణంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
పార్కింగ్‌పై సూచనలు:
రాజకీయ పార్టీల ప్రతినిధులు,ఎన్నికల సిబ్బంది,కౌంటింగ్ ఏజెంట్లు,మీడియా ప్రతినిధులు తమ వాహనాలను పోలీసు శాఖ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపి,ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలి.
మీడియా ప్రతినిధులకు సూచనలు:
కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు సంబంధిత ఎన్నికల అధికారి జారీ చేసిన అధికారిక అనుమతి పత్రం తప్పనిసరి. అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే ఫొటోగ్రఫీ,వీడియోగ్రఫీ చేయాలి.
సోషల్ మీడియాపై నిఘా:
ఎన్నికల ఫలితాలకు సంబంధించి అసత్య,రెచ్చగొట్టే,విద్వేషపూరిత పోస్టులు,వీడియోలు ప్రచారం చేయడం లేదా షేర్ చేయడం చేయరాదు. ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులతో పాటు సంబంధిత బాధ్యత కలిగిన అడ్మిన్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:
ఓట్ల లెక్కింపు అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు,ఊరేగింపులు, బహిరంగ వేడుకలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. బాణసంచా కాల్చడం,రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం,ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా,పారదర్శకంగా పూర్తయ్యేలా ప్రజలు,అభ్యర్థులు, రాజకీయ నాయకులు,కౌంటింగ్ ఏజెంట్లు,మీడియా ప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నిబంధనలు,పోలీసు సూచనలు పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




