Mamidikuduru: సారవంతమైన భూములు నదిలోకి నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు పట్టించుకునే వారేరీ!
Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో గోదావరి నది కోత తీవ్రరూపం. భూములు, కొబ్బరి చెట్లు కోల్పోతున్నామని రైతుల ఆందోళన. శాశ్వత రక్షణ కోరుతూ విజ్ఞప్తి.
Mamidikuduru: సారవంతమైన భూములు నదిలోకి నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు పట్టించుకునే వారేరీ!
Mamidikuduru: తుఫాన్ల ప్రభావంతో గోదావరి నది తీర ప్రాంతాల్లో భూకోత తీవ్రరూపం దాల్చుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పెదపట్నం, అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పాశర్లపూడి, ఆదుర్రు తదితర గ్రామాల్లో నది కోత కారణంగా సారవంతమైన వ్యవసాయ భూములు క్రమంగా గోదావరిలో కలిసిపోతున్నాయి.
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిపాలవుతుండటంతో తీర ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములతో పాటు కొబ్బరి చెట్లు సైతం నేలకొరుగుతుండటంతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. నది కోత ఇలాగే కొనసాగితే తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎంతోకాలంగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదని తీర గ్రామాల రైతులు వాపోతున్నారు. ప్రతి తుఫాను సమయంలో భూకోత ముప్పు మరింత పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు.
గోదావరి కోత నివారణకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టి, తమ పంట భూములు, కొబ్బరి తోటలను కాపాడాలని ప్రభుత్వాన్ని తీర ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.




