Konaseema: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా - ప్రశాంతి ఐఏఎస్!

Konaseema: కోనసీమ జిల్లాలో ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి ఐఏఎస్ తనిఖీలు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్‌ భద్రతపై అధికారులకు సూచనలు.

SURESH, AMALAPURAM
Published on: 24 Oct 2026 9:30 PM IST
Konaseema
X

Konaseema: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా - ప్రశాంతి ఐఏఎస్!

కోనసీమ: ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి ఐఏఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి,ఆయా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు,స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇందిరాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మలికిపురం, సఖినేటిపల్లి,మామిడికుదురు, అల్లవరం,అమలాపురం జెడ్పీ సీఈఓ కార్యాలయం,కె. గంగవరం,ఐ.పోలవరం మండలాల్లోని సంబంధిత కార్యాలయాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

ఐ.పోలవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి,ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి మాట్లాడుతూ,ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ,ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సమకూర్చుకోవాలని,స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని,ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ పర్యటనలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బి. రమణ,ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ రవివర్మ, ముమ్మిడివరం తహసీల్దార్ టి. సుభాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM