Kesanapalli: కేశనపల్లిలో రూ.2 కోట్లతో పీహెచ్‌సీ: ఎమ్మెల్యే వరప్రసాద్

Kesanapalli: మలికిపురం మండలం కేశనపల్లిలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.

PRABHU, RAZOLE
Published on: 24 Sept 2026 4:31 PM IST
Kesanapalli
X

Kesanapalli: కేశనపల్లిలో రూ.2 కోట్లతో పీహెచ్‌సీ: ఎమ్మెల్యే వరప్రసాద్

కేశనపల్లి : డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయిన అనంతరం కేశనపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి అవసరమైన ఒక ఎకరం స్థలంతో పాటు, అప్రోచ్ రోడ్డుకు కావాల్సిన స్థలాన్ని అందించిన దాతలకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని విలువైన స్థలాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. దాతల సహకారం వల్ల గ్రామంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు.

నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ప్రాథమిక చికిత్సలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కేశనపల్లి గ్రామంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE