Kadiyam: నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే గోరంట్లకు వినతి
Kadiyam: కడియం నర్సరీ రైతులకు గతంలో మాదిరిగా సబ్సిడీపై సోలార్ మోటార్లు, జేసీబీ అందించాలని కోరుతూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది.
Kadiyam: నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే గోరంట్లకు వినతి
కడియం: ఎన్టీఆర్ జలసిరి, ఆర్కేవివై పథకాల ద్వారా గతంలో కడియం నర్సరీలకు సోలార్ మోటార్లను సబ్సిడీపై ఇచ్చారని, మరలా ఆ స్కీములను పునరుద్ధరించాలని కోరుతూ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొరుసు సుబ్బారాయుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వినతి పత్రం సమర్పించారు.
కడియం మండలం, కడియపులంక గ్రామానికి చెందిన అసోసియేషన్ అధ్యక్షులు మరియు పెద్దలు మంగళవారం ఎమ్మెల్యే గోరంట్లను కలిసి నర్సరీ రైతుల సమస్యలపై చర్చించారు. ఈ పథకాన్ని పునరుద్ధరించడం వలన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారన్నారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గోరంట్ల, రాష్ట్ర ఇందన శాఖామంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో మాట్లాడి, పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పంపింగా, నెల రోజులలో సోలార్ మోటార్లు సబ్సిడీపై ఇచ్చే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా నర్సరీ అసోసియేషన్ కు జేసిబి ని రాయితీలో అందించాలని కోరగా, ఎమ్మెల్యే స్పందించి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గోరంట్ల కు అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పాటంశెట్టి శ్రీనివాసురావు, పెద్దలు మార్గాని సత్యనారాయణ, గట్టి సుబ్బారావు, వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ మరియు అసోసియేషన్ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.




