Rajahmundry: వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Rajahmundry: రాజమండ్రి మంజీర కన్వెన్షన్‌లో జరిగిన ISECON 2026 సదస్సులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని పేదలకు మెరుగైన వైద్యం అందాలని ఆకాంక్షించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 4 Oct 2026 3:55 PM IST
Rajahmundry
X

Rajahmundry: వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రి: మంజీర కన్వెన్షన్‌లో నిర్వహించిన ISECON 2026 వైద్య సదస్సుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది కేవలం ఒక ఉద్యోగం కాదని, మానవ ప్రాణాలను కాపాడే అత్యంత పవిత్రమైన బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

సమాజంలో వైద్యులకు ఎంతో గౌరవం, ప్రత్యేక స్థానం ఉందని, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో పాటు ఆ కుటుంబానికి భరోసా కల్పించే గొప్ప సేవను వైద్యులు అందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, కొత్త చికిత్సా విధానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వైద్య పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సదస్సులు వైద్యులకు తమ అనుభవాలను, పరిశోధనలను, నూతన వైద్య విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

సీనియర్ వైద్యుల అనుభవాలు, యువ వైద్యుల నూతన ఆలోచనలు ఒకే వేదికపై కలవడం ద్వారా వైద్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వైద్యులు ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ, రోగి పట్ల మానవతా దృక్పథం, ఆప్యాయత, భరోసా అత్యంత ముఖ్యమన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి తన ఆరోగ్యంపై ఆందోళనతో ఉంటారని, అలాంటి సమయంలో వైద్యుడు ఇచ్చే ధైర్యం కూడా ఒక రకమైన చికిత్సేనన్నారు.

ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక చర్యలు చేపడుతోందని, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు, ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యుల సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన వైద్య సదస్సు నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలిపారు.

ఈ సదస్సు ద్వారా వైద్య రంగంలో కొత్త ఆలోచనలు, పరిశోధనలు, అనుభవాల మార్పిడి జరిగి భవిష్యత్‌లో మరింత మెరుగైన వైద్య సేవలకు మార్గం సుగమం కావాలని ఆకాంక్షించారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రాణాలను కాపాడే వైద్యుల సేవలకు సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వైద్యులందరికీ తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY