Razole: రాజోలులో జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు!
Razole: కోనసీమ జిల్లా రాజోలులో మురసు తుఫాన్ బీభత్సం. ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ప్రైవేట్ భవనానికి మార్చిన అధికారులు.
Razole: రాజోలులో జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మురసు తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇటీవల అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోనసీమ ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ రూపంలో మురసు ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజోలు దీవి అతలాకుతలమవుతోంది.
భారీ వర్షాల కారణంగా రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజోలు మండల పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం,బస్ డిపో, ప్రభుత్వ ఆసుపత్రి, ట్రెజరీ, పోలీస్ కార్యాలయాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో అక్కడ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, రేపు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం నీటమునగడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీపంలోని ఓ ప్రైవేట్ భవనానికి మార్చినట్లు సమాచారం.
తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాలే నీటమునిగిన పరిస్థితి నెలకొనడంతో ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభావం పడుతోంది. భారీ వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.




