Vadapalli: వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా గజవాహన సేవ!
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు రాజధిరాజ అలంకరణలో గజవాహన సేవ వైభవంగా జరిగింది.
Vadapalli: వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా గజవాహన సేవ!
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం గజ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి రాజధిరాజ అలంకరణలో శ్రీ స్వామివారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
తిరుమల తరహాలో వాడపల్లి క్షేత్రంలోనూ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 5.01 గంటలకు సుప్రభాత సేవ, నవనీత హారతితో ఏడవ రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పారమాత్మిక ఉపనిషత్ పూర్వక అష్టోత్తర శతకలశాభిషేకం, లక్ష తులసి పూజ, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ తదితర ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
సాయంత్రం స్వస్తి వాచనం, ప్రధాన హోమాలు, నవగ్రహ హోమాలు, శ్రీ లక్ష్మీవేంకటేశ్వర మూలమంత్ర పూర్వక వేంకటేశ్వర హోమం నిర్వహించి, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
రాత్రి రాజధిరాజ అలంకరణలో గజ వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు, ప్రత్యేక ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. కళాకారుల ప్రదర్శనలతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గజ వాహన సేవతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు వేడుకలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా నిర్వహించారు.




