Rajahmundry: దివ్యాంగులకు అండగా ఉందాం..మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి పిలుపు!

Rajahmundry: రాజమండ్రిలో గెయిల్ సీఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ క్యాంపు ప్రారంభం. హాజరైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి, ఎమ్మెల్సీ సోము.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 3 Oct 2026 1:48 PM IST
Rajahmundry
X

Rajahmundry: దివ్యాంగులకు అండగా ఉందాం..మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి పిలుపు!

Rajahmundry: దివ్యాంగులకు మనమంతా అండగా ఉండి... వారి భవిష్యత్తుకు ధైర్యాన్నిద్దామని మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దివ్యాంగులకు అండగా నిలిచి, వారి భవిష్యత్తుకు ధైర్యాన్ని అందించేలా గెయిల్ సంస్థ సీఎసఆర్ నిధుల నుంచి రూ.30 లక్షలతో సహాయ పరికరాల పంపిణీ కోసం ప్రత్యేక క్యాంపును నిర్వహించారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఎన్ రోడ్డులోని వి.కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ క్యాంపును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్ కోసం దివ్యాంగుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గెయిల్ సంస్థ సీఎసఆర్ నిధుల ద్వారా రూ.30 లక్షలతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, నడక కర్రలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముందుగా లబ్ధిదారుల నుంచి రిజిస్ట్రేషన్ చేపట్టి, వారి అవసరాలకు అనుగుణంగా పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం కోసం గెయిల్ సంస్థ నుంచి నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

సీఎసఆర్ నిధులను ప్రజా అవసరాలకు వినియోగించేలా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.

రాజమహేంద్రవరం నగరంతో పాటు పుష్కరాలకు సంబంధించిన పరిసర మున్సిపాలిటీలకు కలిపి సుమారు రూ.2 వేల కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో గెయిల్ సంస్థను సీఎసఆర్ నిధులు కోరగా రూ.30 లక్షలు కేటాయించిందన్నారు.

ఈ నిధులతో నాలుగు రకాల సహాయ పరికరాలను అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు మేలు చేసే ప్రతి అవకాశాన్ని అన్వేషిస్తూ పనిచేస్తున్నామని చెప్పారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్ల వరకు నిధులు కేటాయించడం అభినందనీయమని, రాజమహేంద్రవరం పరిధిలోని పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంత్రి నారాయణను కోరారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీఎసఆర్ నిధులను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా, తన వంతు బాధ్యతగా ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు.

నగరంలో చక్కటి పార్కులు, ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆయన నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు ఎంత మంచి సౌకర్యాలు కల్పించినా, వాటిని మరింత మెరుగ్గా అందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ల కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY