Sakinetipalli: కోనసీమలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం!

Sakinetipalli: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలోని ఆసుపత్రిలో 9 నెలల గర్భిణిలా కనిపించిన మహిళ కడుపు నుంచి 4 కేజీల భారీ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు.

PRABHU, RAZOLE
Published on: 7 Oct 2026 3:52 PM IST
Sakinetipalli
X

Sakinetipalli: కోనసీమలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం!

Sakinetipalli: డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. సఖినేటిపల్లి మండలం మోరిలోని సుబ్బమ్మ మిషన్‌ ఆసుపత్రిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ గర్భాశయంలోని సుమారు నాలుగు కిలోల భారీ కణితిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.

భారీ కణితి కారణంగా ఆమె తొమ్మిది నెలల గర్భిణిలా కనిపించడంతోపాటు, కణితి ఒత్తిడితో కిడ్నీలు, మూత్రనాళాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ లతాపాల్‌ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేపట్టింది.

ముందుగా ఒంగోలుకు చెందిన యూరాలజిస్ట్‌ డాక్టర్‌ నోయల్‌ జాన్‌ మూత్రనాళాల్లో స్టెంట్లు అమర్చారు. అనంతరం రాయవెల్లూరుకు చెందిన డాక్టర్‌ పాల్‌ ఇమ్మాన్యుయేల్‌ ఆధ్వర్యంలో క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయం నుంచి నాలుగు కిలోల బరువున్న భారీ కణితిని విజయవంతంగా తొలగించారు.

శస్త్రచికిత్స అనంతరం నొప్పి నియంత్రణ కోసం డాక్టర్‌ సృజన ఆధ్వర్యంలో ఎపిడ్యూరల్‌ క్యాథటర్‌ ఏర్పాటు చేశారు. రోగికి రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి చైర్మన్‌ నల్లి డార్విన్‌ అభినందించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE